హాట్ హీరోయిన్ కంట నీళ్లు

Update: 2015-10-20 08:59 GMT
పాపం రమ్య. చక్కగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూ ఉన్న రోజుల్లో ఊరికే ఉండకుండా రాజకీయాల్లోకి దూకింది. ఎంపీ ఎన్నికల కోసం నామినేషన్ వేస్తుండగా తండ్రి చనిపోవడంతో సెంటిమెంటు వర్కవుటై మాండ్య ఎంపీ అయింది. 30 ఏళ్లకే ఎంపీ అవడంతో అదృష్టమంటే రమ్యదే అనుకున్నారు. కానీ ఆ పదవి మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఆర్నెల్లకే మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఎన్నికల్లో ఓడిపోయింది. పదవి పోయింది. ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ అండ చూసుకుని మోడీ గురించి అవాకులు చెవాకులు పేలింది. దెబ్బకు ఎన్నికల తర్వాత భాజపా ఆమెను టార్గెట్ చేసుకుంది. మరోవైపు సొంత కాంగ్రెస్ పార్టీలోనూ ఆమెకు అందరూ వ్యతిరేకులే. నాకు రాజకీయాలు సరిపడవని ఊరుకున్నా పోయేది. పార్టీలోనే కొనసాగుతూ.. ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ లేని పోని ఇబ్బందులు పడుతోంది ఈ హాట్ హీరోయిన్.

ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ.. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబానికి నష్ట పరిహారం కింద చెక్కు ఇచ్చింది. ఈ చెక్కు విషయంలో రమ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతే.. దీని మీద పెద్ద వివాదం రేగింది. సొంత పార్టీ వాళ్లే రమ్యను ఏకిపడేశారు. దీంతో నేరుగా మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ ఇంటికెళ్లి ఆయన దగ్గర బోరుమంది రమ్య. రైతు కుటుంబానికి అందజేసిన చెక్కు విషయంలో తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని వివరించి.. తన రాజకీయ ప్రత్యర్థులు కావాలనే ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారని వాపోయింది. పరిస్థితులు చూస్తుంటే తాను రాజకీయాల నుంచే తప్పుకోవాలనే భావన కలుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కృష్ణ ఇంటి నుంచి కన్నీళ్లతోనే బయటికొచ్చిన రమ్య.. కళ్లు తుడుచుకుంటూ మీడియాతో ఏం మాట్లాడుకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Tags:    

Similar News