'వెంకీ మామ'.. అబ్బాయిని ఇరికిస్తున్నారా?

Update: 2019-01-31 14:12 GMT
వెంకటేష్‌, నాగచైతన్యల కాంబోలో మూవీ గురించి గత సంవత్సర కాలంగా చర్చలు జరుగుతున్నాయి. దర్శకుడు బాబీ ఈ కాంబో కోసం కథను సిద్దం చేస్తున్నాడు. సురేష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి 'వెంకీ మామ' అనే టైటిల్‌ ను కూడా ఖరారు చేశారంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. 'ఎఫ్‌ 2' చిత్రం సక్సెస్‌ తో జోష్‌ మీదున్న వెంకటేష్‌ వెంటనే 'వెంకీ మామ'ను చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దర్శకుడు బాబీ కూడా స్క్రిప్ట్‌ కు తుదిమెరుగులు అద్దుతున్నాడట.

ఇక ఈ చిత్రం క్రేజ్‌ ను మరింత పెంచేందుకు సురేష్‌ బాబు చిన్న ప్రయత్నం చేయాలని భావిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మామ - అల్లుడు సినిమాలో అబ్బాయి రానా కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రానా కోసం ఈ చిత్రంలో ఒక కీలకమైన గెస్ట్‌ రోల్‌ ను దర్శకుడు క్రియేట్‌ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంకటేష్‌ - రానాల సినిమా కోసం కూడా ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఆ కోరిక కూడా ఈ సినిమాతో తీరిపోతుందనే ఉద్దేశ్యంతో సురేష్‌ బాబు ఈ ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు.

కథలో భాగంగా అతిథి పాత్ర ఉంటే పర్వాలేదు. కాని కథలో రానా పాత్రను బలవంతంగా జొప్పిస్తే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అయితే నిర్మాత సురేష్‌ బాబు కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆచి తూచి సినిమాలు చేస్తున్న సురేష్‌ బాబు ఈ సినిమాలో రానా పాత్ర సరిగ్గా సూట్‌ అయితేనే ఫైనల్‌ గా ఉంచుతారు. ఒక వేళ జొప్పించినట్లుగా అనిపిస్తే మాత్రం తప్పకుండా తీసేస్తారు. చూద్దాం అసలు వెంకీ మామలో రానా ఉంటాడా, లేదా అనేది అతి త్వరలోనే తేలిపోనుంది.

Tags:    

Similar News