ప్రముఖ కథానాయిక రాణీముఖర్జీ తల్లయింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆమె ఓ ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. పాప అలా పుట్టిందో లేదో వెంటనే ఇలా నామకరణం కూడా చేసేశారు. చిన్నారికి అదిరా అనే పేరు కూడా పెట్టారు. ఆదిత్య చోప్రా - రాణీ ముఖర్జీ అన్న రెండు పేర్లూ కలిసేలా పాపకి పేరు పెట్టారు. ప్రముఖ దర్శకుడు - నిర్మాత అయిన ఆదిత్య చోప్రా - రాణీముఖర్జీ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. అప్పటికే పెళ్లయిన ఆదిత్య తన మొదటి భార్యకి విడాకులిచ్చి రాణీ ముఖర్జీని పెళ్లి చేసుకొన్నాడు. పెళ్లికి ముందు చాలా కాలం పాటు ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. పలుమార్లు రహస్యంగా పెళ్లి చేసుకొన్నారని కూడా ప్రచారం సాగింది. కానీ గతేడాది ఆ ఇద్దరూ పరిమిత సంఖ్యలో బంధు మిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రాణీముఖర్జీ. నీలికళ్లతో చూడగానే ఆకర్షించే అందం ఆమె సొంతం. పెళ్లి చేసుకొన్నాక కూడా ఆమె మర్దానీ అనే చిత్రంలో నటించింది. భవిష్యత్తులో ఆమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశాలున్నాయి.