డైరెక్షన్ చేసి తీరతానంటున్న సుక్కు ఫ్రెండ్

Update: 2015-11-25 09:30 GMT
సౌత్ ఇండియాలో ఉన్న బెస్ట్ సినిమాటోగ్రాఫర్లలో రత్నవేలు ఒకడు. సేతు - ఆర్య - జగడం - సూర్య సన్నాఫ్ కృష్ణన్ - రోబో - 1 నేనొక్కడినే - కుమారి 21 ఎఫ్.. ఈ సినిమాలే చెప్పేస్తాయి రత్నవేలు స్థాయి ఏంటన్నది. ఒకప్పుడు కేవలం తన మాతృ భాష తమిళంలో మాత్రమే సినిమాలు చేసిన రత్నవేలు.. ‘ఆర్య’ దగ్గర్నుంచి తెలుగులో సుకుమార్ ప్రతి సినిమాకూ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. సుక్కుకు బెస్ట్ ఫ్రెండ్ గా మారిన రత్నవేలు.. అతడి నిర్మాణంలో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’కు పారితోషకం కూడా తీసుకోకుండా పని చేయడం విశేషం. తన మిత్రుడి మీద ఉన్న గౌరవంతోనే అలా చేశానంటున్న రత్నవేలు... సుక్కు, మరికొందరు దర్శకుల స్ఫూర్తితో త్వరలోనే తాను డైరెక్షన్ కూడా చేయబోతున్నట్లు చెప్పాడు.

‘‘బాల - గౌతమ్ మీనన్ - సుకుమార్ లాంటి గొప్ప దర్శకులతో పని చేసిన అనుభవం నాకుంది. నేను పని చేసే ప్రతి సినిమా విషయంలోనూ స్క్రిప్టు క్షుణ్నంగా చదువుతాను. దర్శకులతో చాలా విషయాలు చర్చిస్తాను. సినిమాటోగ్రఫీని కూడా డైరెక్షన్ లాగే భావిస్తాను నేను. దర్శకులు స్క్రిప్టు రాసినట్లే కెమెరా రిపోర్ట్ రాయడం నాకు అలవాటు. రోబో సినిమాకు అలా 1600 పేజీల కెమెరా రిపోర్ట్ రాశాను. అదే తరహాలో స్క్రిప్టు కూడా రాయగలనన్న నమ్మకం ఉంది. కచ్చితంగా డైరెక్షన్ చేస్తాను. త్వరలోనే ఆ సినిమా మొదలవుతుంది’’ అని రత్నవేలు చెప్పాడు.

తాను పని చేసిన హీరోల్లో మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని రత్నవేలు తెలిపాడు. 1 నేనొక్కడినే సినిమాకు అతడితో పని చేయడం గొప్ప అనుభవమని.. ఇప్పుడు తమ కాంబినేషన్ లో ‘బ్రహ్మోత్సవం’ కూడా వస్తోందని రత్నవేలు చెప్పాడు. ‘‘1 నేనొక్కడినే సినిమా ఫస్ట్ షాట్ పూర్తవగానే మహేష్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తన స్కిన్ టోన్ ఇంత పర్ఫెక్ట్ గా, అందంగా ఎవరూ క్యాప్చర్ చేయలేదని చెప్పాడు. మహేష్ గొప్ప నటుడు. యాక్షన్ హీరోగా కనిపించి వెంటనే ఫ్యామిలీ హీరోగా మారిపోతాడు. అతడికి నేను పెద్ద ఫ్యాన్’’ అని రత్నవేలు అన్నాడు.
Tags:    

Similar News