బిగ్ బాస్.. నువ్వు కూడానా..రవిని దెబ్బేశావే!

Update: 2021-11-29 11:06 GMT
అనుకోని రీతిలో వెన్నుపోటు పొడిచిన ప్రతి సందర్భంలోనూ ప్రపంచంలో ఏమూలన ఉన్న వారైనా సరే గుర్తుకు తెచ్చుకునే వాక్యం.. ‘ఎట్ టు బ్రూటస్’. షేక్ స్పియర్ నాటకాల్లో ఒకటైన ‘జూలియస్ సీజర్’లో ‘‘ఎట్ టు బ్రూటస్’’ (బ్రూటస్ నువ్వు కూడానా?) అంటూ ఆశ్చర్యానికి గురవుతూ అన్న మాట చప్పున గుర్తుకు వస్తుంది ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన వారందరికి. తాజా ఎలిమినేషన్ లో యాంకర్ రవిని ఎలిమినేట్ చేస్తూ బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయంపై విమర్శల వర్షం కురుస్తోంది. రవికి ఇంత భారీగా అభిమానులు ఉన్నారా? అన్నట్లుగా ఇప్పుడు ప్రతిస్పందనలు వస్తున్నాయి. మరి.. వీరంతా ఓట్లు వేయలేదా? ఒకవేళ వేస్తే.. రవి సేఫ్ గా ఉండాలి కదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

నిజానికి బిగ్ బాస్ సీజన్ 5లో అత్యంత దురదృష్టవంతుడు.. పెద్దఎత్తున కార్నర్ అయినోడు.. తరచూ లేబిలింగ్ కు గురైనోడు ఎవరైనా ఉన్నారంటే అది యాంకర్ రవినే. బిగ్ బాస్ ప్రారంభం నుంచే యాంకర్ రవిని ‘ఇన్ ఫ్లుయిన్స్’ చేస్తున్నారంటూ ఆట పట్టించటం.. అందుకు తగ్గట్లే హౌస్ మేట్లు సైతం తరచూ అతన్ని ఇన్ ఫ్లుయిన్స్ చేస్తున్నారంటూ ఆడిపోసుకోవటం.. సూటిపోటి మాటలతో ఎంతలా ఆడుకున్నా.. అతను ఎప్పుడు తన బ్యాలెన్స్ తప్పలేదు. అంతేకాదు.. తన మీద నెగిటివ్ లేబులింగ్ అవుతున్నప్పటికి మౌనంగా ఉన్నాడే కానీ.. వాపోలేదు.

సన్ని లాంటి ‘మచ్చా’.. ఒక దశలో బయటకు వెళ్లాక చూసుకుందామనుకున్నా.. ఆ మాటను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. అదే మాట రవి నోటి నుంచి వచ్చి ఉంటే రచ్చ రచ్చ చేసేవాళ్లు. రవిని వ్యూహాత్మకంగా టార్గెట్ చేసిన వైనం తొలి ఎపిసోడ్ నుంచి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. రవి ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన వారిలో ప్రధమ ముద్దాయి ఎవరైనా ఉన్నారంటే.. వారాంతంలో దర్శనమిచ్చే నాగార్జునే అని చెప్పాలి. హౌస్ లో ఉన్న వారందరిని ఒకటిలా చూడాలి. అందరిని ఒకేలా ట్రీట్ చేయాలి. ఒకరి విషయంలో గారంగా.. మరొకరివిషయంలో బెరుగ్గా.. ఇంకొకరి విషయంలో విసురుగా.. ఇలా వ్యవహరించే ధోరణి తప్పు.

అందరిని అప్పుడప్పుడు ఆట పట్టించినా.. ప్రతివారం నాగార్జున టార్గెట్ చేసే ఒకే ఒక్కడు యాంకర్ రవి. అతన్ని ఇన్ ఫ్లుయిన్స్ చేస్తారని నాగార్జునే చెబుతున్నప్పుడు.. మిగిలిన హౌస్ మేట్స్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోకుండా ఉంటారు. తన కారణంగా యాంకర్ రవి టార్గెట్ అవుతున్న విషయాన్ని నాగ్ ఎందుకు పట్టించుకోలేదు. టాస్కుల సమయంలో కాజల్.. సన్నీ.. మానస్ లాంటి వారు .. ‘‘ఫేక్’’.. ‘‘గుంట నక్క’’.. ‘‘మాస్కు వేసుకుంటావ్’’ లాంటి వ్యాఖ్యలు తరచూ చేస్తూ.. యాంకర్ రవి అన్నంతనే నెగిటివ్ ఇమేజ్ కలిగేలా లేబులింగ్ చేయటంలో సక్సెస్ అయ్యారు.

ఇలాంటి వాటికి నాగార్జున సైతం ఇతోధికంగా సాయం చేశారనే చెప్పాలి. బిగ్ బాస్ షోలో ఎవరికి వారు తమ వ్యక్తిగత గేమ్ ఆడాలి. ఇప్పుడున్న వారిని చూస్తే.. యాంకర్ రవి.. సింగర్ శ్రీరామ చంద్ర మినహా మిగిలిన వారెవరూ ఇండివిడ్యువల్ గేమ్ ఆడని వైనం అందరికి తెలిసిందే. ఇక్కడే మౌస్ లో ఫెయిర్ గేమ్ ఆడింది ఎవరు? అన్నది అర్థమవుతుంది. ఆదివారం ఎపిసోడ్ చూసినప్పుడు.. కాజల్ ను సేవ్ చేసేందుకు తన దగ్గరున్న ఎవిక్షన్ పాస్ ఇచ్చేయటం ద్వారా సన్నీ స్నేహ ధర్మాన్ని పాటించారనే కన్నా.. తన గ్రూప్ ను సేవ్ చేయటానికి ప్రయత్నించారని చెప్పకతప్పదు.

ఎలిమినేట్ అయ్యాక.. రవి బుగ్గల మీద ముద్దులు మీద ముద్దులు పెట్టేయటం ద్వారా..హమ్మయ్యా పీడ వదిలింది రా బాబు.. ఫైనల్ పోరులో లేడు.. వెళ్లిపోయేవాడి కన్నీళ్లను తన ముద్దులతో కడిగేయాలన్నట్లుగా సన్నీతీరు ఉందని చెప్పాలి. ఒకవైపు తన స్నేహితురాలిని సేవ్ చేయటం ద్వారా.. రవిని బలి ఇచ్చేందుకు వెనుకాడని సన్నీ.. ఎలిమినేట్ అయ్యాక మాత్రం ముద్దులు పెట్టి పంపటం దేనికి నిదర్శనం?
హౌస్ లో జరిగే కుళ్లు.. కుతంత్రాలు.. కుట్రల్ని చూస్తున్న ప్రేక్షకులు వేసే ఓట్ల ఆధారంగానే వారాంతంలో ఎలిమినేషన్ ఉందన్న మాటే నిజమైతే.. మరి.. అందులో పారదర్శకత ఏమిటి? నిజంగానే రవికి తక్కువ ఓట్లు వచ్చాయనటానికి ఆధారం ఏమిటి? ఇప్పటికే హౌస్ లో ఉన్న వారిలో అత్యంత ప్రమాదకారిగా.. తరచూ హౌస్ లో గొడవలు పెట్టే కాజల్ ఇంకా ఎలిమినేట్ కాకపోవటం ఏమిటి? గత వారంలో ఆమె ప్రియాంక ట్రాన్స్ కమ్యునిటీని ప్రస్తావించి ఎమోషనల్ డ్రామాను ఆడేందుకు వెనుకాడని కాజల్ కు ప్రేక్షకులు అత్యధిక ఓట్లు వేయటమా? అంటే.. అలాంటి కన్నింగ్ మైండ్ సెట్ ఉన్న వారినే ప్రేక్షకులు ఇష్టపడతారా? అన్న సందేహం.. తాజాగా ఎలిమినేషన్ ను చూస్తే అర్థమవుతుంది.

ఇక్కడ మరో అంశాన్ని ప్రస్తావించాలి. హౌస్ లో రెండు జట్లు ఉన్నాయనుకుంటే.. సన్నీ.. మానస్.. ప్రియాంక.. కాజల్ ఒక గ్రూపు అయితే.. సిరి.. షణ్ముఖ్ ఒక జట్టు. కాస్తో కూస్తో రవి.. శ్రీరామ్ చంద్రలు షణ్ముఖ్ జట్టులో ఉన్నారన్నట్లు కనిపించినా.. జట్టుగా ఉన్న ప్రయోజనం ఎప్పుడూ రవి పొందింది లేదు. ఇది చూసినప్పుడు సన్నీ టీం మొత్తం కలిసి కట్టుగా గుంపుగా ఆటను ఆడుతూ.. తమలో ఒకడిని విన్నర్ అయ్యేలా ప్లాన్ చేస్తే.. షణ్ముఖ్ టీం లో ఉన్న వారంతా కలిసి ఉంటారు కానీ.. గేమ్ ను గేమ్ లా ఆడుతున్నారని చెప్పాలి. పలు సందర్భాల్లో నిజాయితీగా సన్నీ టీంలోని వారికి మెచ్చుకోళ్లు ఇవ్వాల్సి వస్తే నిజాయితీగా ఇచ్చేందుకు రవి వెనుకాడలేదు. కానీ.. రవి విషయంలో మాత్రం సన్నీ టీం నిర్దాక్షిణ్యగా వ్యవహరించి.. ఎలిమినేట్ అయ్యే వరకు వెంటాడి వేటాడారనే చెప్పాలి.

హౌస్ లో ఉన్న వారు తమకన్నా బలవంతుడైన రవిని దెబ్బేయటానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. చివరకు వారిలో బిగ్ బాస్ కూడా చేరారు. ఓట్ల పేరుతో ఎలిమినేట్ చేయటం ద్వారా.. బిగ్ బాస్.. మీరు కూడానా..? అంటూ సీజర్ అన్న మాటల్నే ఈ రోజు బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులంతా అనుకునే పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పాలి.





Tags:    

Similar News