క్రిస్మస్ నాడు రామారావు డ్యూటీ ఇలా.. ఖిలాడి స్టైలింగ్ అలా..!

Update: 2021-12-25 07:33 GMT
'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే 'ఖిలాడి' 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగ్ లను చివరి దశకు తీసుకొచ్చిన రవితేజ.. 'రావణాసుర' 'ధమాకా' 'టైగర్ నాగేశ్వరరావు' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. నేడు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వీటిలో రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు.

రవితేజ హీరోగా కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ ''రామారావు ఆన్ డ్యూటీ''. క్రిస్మస్ శుభాకాంక్షలతో తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఇందులో ఓ పెద్దావిడ కృతజ్ఞతా భావంతో చేతులెత్తి దండం పెడుతుండగా.. రవితేజ చిరునవ్వుతో ఆమె చేతులను పట్టుకుని కనిపిస్తున్నాడు. ప్రభుత్వ అధికారి అయిన రామారావు తన డ్యూటీలో భాగంగా ఆవిడకు సాయం చేసినట్లు ఈ పోస్టర్ ద్వారా అర్థం అవుతోంది.

వాస్తవ సంఘటనల స్పూర్తితో 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన రజిషా విజయన్ - దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ - RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ లో మార్చి 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

అలానే 'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ''ఖిలాడి'' చిత్రాన్ని 2022, ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. తాజాగా దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన థర్డ్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. 'అట్టా సూడకే' అనే పెప్పి నంబర్ ను డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓ స్టైలిష్ పోస్టర్ ని వదిలారు.

ఇందులో రవితేజ గ్లాసెస్ పెట్టుకొని బ్లాక్ హుడీ - బ్లాక్ ప్యాంటులో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న 'ఖిలాడి' చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. మీనాక్షి చౌధరి - డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా.. యాక్షన్ హీరో అర్జున్ - అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పెన్ స్టూడియోస్ జయంతీలాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022 ప్రారంభంలో కొన్ని రోజుల గ్యాప్ లో రెండు సినిమాలతో వస్తున్న మాస్ రాజా.. ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.


Tags:    

Similar News