ప్రమోషన్ చేయలేదు.. పైసల్ తగ్గాయ్

Update: 2017-10-20 04:26 GMT
ఒక సినిమాకు ప్రమోషన్ చేయకుండా హైప్ మీద ఆధారపడతాం అంటే ఏమవుతుంది? ఆధారపడొచ్చు.. తప్పులేదు. కాని ఆ హైప్ అనేది బాహుబలి స్థాయిలో ఉందనుకోండి.. బాహుబలి 2కు ప్రమోషన్లు చేయకపోయినా కూడా వర్కవుట్ అవుతుంది. అందుకే ఆ సినిమా అంతపెద్ద సక్సెస్ అయ్యింది. కాని అదే థియరీ మేము రాజా ది గ్రేట్ సినిమా విషయంలో కూడా ఫాలో అవుతాం అంటే ఎలా?

సరిగ్గా నిర్మాత దిల్ రాజు అలాగే ఊహించుకుని.. రాజా ది గ్రేట్ సినిమాను పెద్దగా ప్రమోట్ చేయలేదు. ఇటు వెబ్ లో కాని అటు ఇతర మీడియాల్లో కాని ఈ సినిమాకు అంతగా ప్రమోషన్లే లేవు. ఏదో తూతూమంత్రంగా ఓ రెండు ఇంటర్యూలు ఇచ్చాడు రవితేజ. అవతల నాగార్జున వంటి సీనియర్లు కూడా ప్రతీ ఛానల్ చుట్టూతా తిరుగుతూ ఇంటర్యూలు ఇస్తుంటే.. రవి అండ్ కో మాత్రం అబ్బే మాకెందుకు అనుకున్నారు. కట్ చేస్తే మాస్ లో వీరాభిమానం ఉన్న రవితేజ రాజా ది గ్రేట్ కు తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 4.9 కోట్లు షేర్ వచ్చింది. సినిమా కనీసం 30+ కోట్లు షేర్ వసూలు చేస్తేనే పంపిణీదారులు సేఫ్‌ అవుతారు అనుకుంటున్న సమయంలో.. అసలు ఇంత తక్కువగా తొలిరోజు వసూళ్ళు ఉండడం అనేది షాకే.

అదే కనుక ప్రమోషన్లు చేసుంటే మాత్రం.. సినిమాకు ఖచ్చితంగా తొలిరోజున తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లకు వరకు పలికుండేది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎలాగో దీపావళి తరువాత ఒక్కరోజు మినహాయిస్తే మళ్లీ వీకెండ్ సెలవలు ఉన్నాయి కాబట్టి.. వాటి మీద క్యాష్‌ చేసుకోవడం బాగా కుదిరేది. కాని రాజా ది గ్రేట్ అనుకుంటూ వీరు సింపుల్ లాజిక్ మిస్సయిపోయారు.


Tags:    

Similar News