కుక్కపిల్ల - సబ్బుబిళ్ల - అగ్గిపుల్ల... కాదేదీ కవితకు అనర్హం అన్నాడు వెనకటికో కవి! ఇదే సూత్రాన్ని తు.చ. తప్పకుండా ఫాలో అవుతున్నట్టున్నారు ప్రముఖ దర్శకుడు - నటుడు రవిబాబు. ఆయనకు పెంపుడు జంతువులు అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది, అందుకేనేమో తాను దర్శకత్వం వహించిన గత చిత్రాల్లో కుక్కలకు బాగానే ప్రాధాన్యమిచ్చారు. ఆ మధ్య ఒక సినిమా వాల్ పోస్టర్లు కూడా కేవలం కుక్క పిల్లలతోనే నింపేశారు. హీరో హీరోయిన్లు ఫొటోలు కూడా వేయలేదు! త్వరలోనే ఆయన ఒక పందిపిల్లని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారట! అంతేకాదు, ఆ పందిపిల్లను చంకనేసుకుని ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్యవూకి వెళ్లారు. చిత్రం ఏంటంటే... ఆ ఇంటర్వ్యూ అవుతున్నంతసేపు సదరు హీరో పంది రవిబాబు ఒళ్లోనే కదలకుండా మెదలకుండా ఎంచక్కా కూర్చుంది!
ఇంతకీ ఆ పంది అంతసేపు కూల్ గా ఎలా కూర్చుందంటే.. ఆ రహస్యం కూడా చెప్పారు! పందులకు కూడా మనుషుల్లానే ఫీలింగ్స్ ఉంటాయన్నారు! కంఫర్ట్ గా అనిపిస్తే చిన్న పిల్లలు కదలకుండా మన ఒళ్లో కూర్చుంటారు కదా, ఆ విధంగా మనం పట్టుకోవడంలోనే ఉంటుందని రవిబాబు వివరించారు. ఇంటర్వ్యూ అవుతున్నంత సేపూ చంకలోని పంది పిల్లను నిమురుతూ కూర్చున్నారు. దానికీ బాగా కంఫర్ట్ కుదిరినట్టుంది... ఇంటర్వ్యూని ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా కూర్చుంది. ఏదేమైనా, రవిబాబు తాజా ప్రయత్నం ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. పందిపిల్లతో ఇంటర్వ్యూకి రావడం ఒక ఎత్తు అయితే, ఏకంగా దాన్ని పెట్టి ఓ సినిమా తీసేస్తుండటం ఇంకా విశేషం. ఇంతకీ, ఆ సినిమా పేరు ఏంటో తెలుసా... ‘అదిగో’. రవిబాబు తదుపరి చిత్రం పేరు ఇదే!