పాజిటివ్ మార్పు కోసం బన్నీ ప్రయత్నం

Update: 2018-01-29 04:36 GMT
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఎక్కువగా చేసింది కమర్షియల్ ఎంటర్ టెయినర్లే. మధ్యలో సన్నాఫ్ సత్యమూర్తి - వేదం లాంటి వైవిధ్యమైన చిత్రాలతో మెప్పించినా మొత్తంమీద మాస్ కు నచ్చే ఎలిమెంట్స్ తోనే ఎక్కువగా సినిమాలు చేశాడు. కానీ సమాజంలో మార్పునకు మన వంతు కూడా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన బన్నీది. అందుకోసమే తను స్టార్ హీరో అయినా అదే మెసేజ్ తో తన ఐ యాయ్ దట్ ఛేంజ్ అనే షార్ట్ ఫిలిం చేశాడు.

అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాలో తొలిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు. కుటుంబం కన్నా దేశం గొప్పదని నమ్మే ఆవేశపరుడైన యువకుడిగా ఇందులో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను కమర్షియల్ యాంగిల్ లో కాకుండా నలుగురికి ఉపయోగపడే ఓ మంచి మెసేజ్ చెప్పాలన్నది బన్నీ ఐడియా అని అతడి సన్నిహితులు అంటున్నారు. అందుకోసమే డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమా సబ్జెక్ట్ చెప్పగానే ఓకే చెప్పడమే కాకుండా అందుకోసం అన్నిరకాలుగానూ కష్టపడటానికి సిద్ధం అనేశాడట. నేటి యూత్ లో ఎక్కువమంది మొబైల్స్ ఇంటర్ నెట్ వంటి గాడ్జెట్స్ కు అతుక్కుపోతున్నారు. వారి ఆలోచనలో మార్పుతెచ్చేలా ఈ పాత్ర ఉంటుంది. స్టార్ హీరోగా తన మెసేజ్ ఎక్కువ మందికి యూత్ కు చేరుతుందని బన్నీ బలంగా నమ్ముతున్నాడని.. అందుకోసమే ఇంతకు ముందు ఈ సినిమాకూ పడనంత కష్టం నాపేరు సూర్య కోసం పడుతున్నాడని అతడి సన్నిహితుడు ఒకరు తెలిపారు.

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడే సైనికుల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ నాపేరు సూర్య సినిమాలోని సైనిక పాట రిపబ్లిక్ డేకి రిలీజ్ చేశారు. ఇది చాలామందిని ఆకట్టుకుంది. అలాగే సినిమా.. అందులోని అల్లు అర్జున్ పాత్ర యూత్ కు బాగా కనెక్టయ్యేలా ఉంటుందని సినిమా యూనిట్ అంటోంది. సొసైటీలో ఓ పాజిటివ్ మార్పు తీసుకొచ్చేలా సినిమా ద్వారా ప్రయత్నించడం అభినందనీయమే. కీపిటప్ బన్నీ.


Tags:    

Similar News