అందరిదీ ఒకదారి.. బాలయ్యది మరో దారి

Update: 2018-04-25 09:36 GMT
నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు. అది ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పుడు మరోసారి బాలయ్య తన ‘ప్రత్యేకత’ను చాటుకున్నాడు. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై దుమారం రేగి.. మీడియాతో పరిశ్రమకు వార్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం నిన్న ఒక కీలక సమావేశం జరిగింది టాలీవుడ్లో. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగులోని ప్రముఖ హీరోలందరూ కలిసి ఒక సమావేశం నిర్వహించారు. దీనికి దాదాపుగా అందరు స్టార్ హీరోలూ హాజరయ్యారు. కానీ ఒక్క బాలయ్య మాత్రం ఈ మీటింగ్ కి దూరంగా ఉన్నాడు. పరిశ్రమలో అందరూ కలిసి ఏదైనా సేవా కార్యక్రమాలు చేపట్టినా.. ఇంకేదైనా కార్యక్రమాలు తలపెట్టినా బాలయ్య చురుగ్గానే పాల్గొంటాడు. వాటిలో తన ఆధిపత్యాన్ని చాటే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ సమావేశానికి మాత్రం ఆయన గైర్హాజరు కావడంపై రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టి అనుకూలంగా పని చేసే కొన్ని చానెళ్లను లక్ష్యంగా చేసుకుని వాటిని బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేయడం.. ఆ నేపథ్యంలోనే ఈ సమావేశం ఏర్పాటు కావడంతో తాను దీనికి హాజరైతే ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని బాలయ్య భావించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సమావేశంలో తెలుగుదేశం అనుకూల మీడియాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకంటే తాను ఎటు నిలవాలో తెలియని సందిగ్ధత తలెత్తుతుందని బాలయ్య భావించినట్లు చెబుతున్నారు. దీనికి తోడు ఈ సమావేశం ఆలోచన చేసింది చిరంజీవి కావడం.. కొంత కాలంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం కూడా బాలయ్య వెనక్కి తగ్గడానికి కారణాలుగా తెలుస్తున్నాయి.
Tags:    

Similar News