భాగమతిని అందుకే వద్దన్నారు

Update: 2018-02-04 07:01 GMT
తెలుగులో భాగమతి ఏ రేంజ్ సక్సెస్ అనేది వెంటనే చెప్పలేం కాని సంక్రాంతికి బాగా డల్ అయిపోయిన బాక్స్ ఆఫీస్ కి మాత్రం ఊపిరి ఇచ్చింది. నిజానికి యువి సంస్థ కేవలం తెలుగు మార్కెట్ ని మాత్రమే టార్గెట్ చేసి ఈ సినిమా తీయలేదు. తమిళ, మలయాళ మార్కెట్లను కూడా దృష్టిలో ఉంచుకునే స్టార్ కాస్ట్ సెట్ చేసుకున్నారు. మెయిన్ విలన్ జయరాం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆశా శరత్, అనుష్క లవర్ ఉన్ని ముకుందన్ ముగ్గురు మలయాళీ బ్యాచ్ కాగా డాక్టర్ గా నటించిన తలైవాసల్ విజయ్ తమిళ నటుడు. ఇవన్ని కీలక పాత్రలే. ఏరికోరి మరీ వీళ్ళనే తీసుకోవడానికి కారణం అక్కడ నేటివిటీ సమస్య రాకుండా ప్రేక్షకులు తమ సినిమాలాగే ఫీల్ అవ్వాలనే కారణం వల్లే. కాని అనుకున్నది ఒకటి అయినది ఒకటి. తెలుగులో ఘన విజయం సాధించగా తమిళ్ లో జస్ట్ యావరేజ్ అనిపించుకున్న భాగమతిని మలయాళీలు మాత్రం అక్కున చేర్చుకోలేదు.

దీనికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ వారసుడు ప్రణవ్ నటించిన మొదటి సినిమా ఆది అదే రోజు విడుదల కావడం. కేరళ మొత్తం ఇదే సందడితో హోరెత్తిపోయింది. లాల్ కొడుకుని చూడాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆదికి పోటెత్తారు. దాని ఎఫెక్ట్ నేరుగా భాగమతి మీద పడింది. పైగా కేరళ ప్రేక్షకులు హారర్ ప్రియులు కారు. లారెన్స్ ముని సిరీస్ అక్కడ అందుకే ఆదరణ పొందలేదు. భాగమతి పూర్తి హారర్ సినిమా కాకపోయినా మెయిన్ థ్రెడ్ అంతా దాని చుట్టే ఉంటుంది కాబట్టి సహజంగానే వాళ్లకు ఇది పెద్దగా రుచించలేదు.

తమిళనాడు లో ఇది యావరేజ్ గా నిలవడానికి కారణం అక్కడ లెక్కకు మించి హారర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. అందుకే వాళ్ళను భాగమతి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రమోషన్ పరంగా యువి సంస్థ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా గ్రీన్ స్టూడియో సహకారం పూర్తిగా ఉన్నా కూడా అదేమంత ఫలితం ఇవ్వలేదు. అందుకే ఆ రెండు రాష్ట్రాల్లో సారీ భాగమతి అనేసారు. కర్ణాటక వరకు కొంత నయం. తెలుగు - తమిళ్ వెర్షన్లు రెండు విడుదల అయ్యాయి కాబట్టి ఓ మోస్తరు ఆదరణ దక్కింది. అభిరుచుల్లో తేడా ఉన్నప్పుడు దాని ప్రభావం సినిమాల ఫలితాల మీద పడుతుంది అని భాగమతితో మరోసారి రుజువయ్యింది.
Tags:    

Similar News