నాగ్ ఊరికే ప్రమోట్ చేయలేదట

Update: 2016-02-25 09:30 GMT
కొత్త డైరెక్టర్.. ఒక సినిమా అనుభవం మాత్రమే ఉన్న చిన్న హీరో.. హీరోయిన్లు కొత్త వాళ్లు.. నిర్మాణ సంస్థ కూడా కొత్తదే.. ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమాకు ప్రచారం దక్కడం చాలా కష్టం. కానీ ‘పడేసావే’ సినిమా మాత్రం చాలా రోజుల నుంచి వార్తల్లో ఉంది. మంచి క్రేజ్ మధ్య ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు కూడా వస్తోంది. ఐతే ఈ సినిమా ఇలా వార్తల్లో ఉండటానికి కారణం అక్కినేని నాగార్జునే. ఈ సినిమా గురించి జనాలకు తెలిసేలా చేసింది.. దాని మీద ఆసక్తి కలిగేలా చేసింది ఆయనే. దీన్ని తన సొంత సినిమా లాగా భావించి ఆయన ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి వేడుకలోనూ ఆయనున్నారు. సినిమా యూనిట్ సభ్యులతో కలిసి ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్లను ఇంటర్వ్యూ కూడా చేశాడు.

ఐతే ఈ సినిమా మీద నాగ్ ఇంతగా శ్రద్ధ పెట్టడానికి కారణమేంటి అని జనాల్లో సందేహం ఉంది. డైరెక్టర్ చునియా ఆయన సంస్థలో పని చేసినప్పటికీ ఇంతగా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఐతే సినిమా నచ్చడం వల్లే తాను ఇంత సపోర్ట్ ఇస్తున్నానని అంటున్నాడు నాగ్. ‘‘చునియా నాకు తెలుసు కాబట్టి సినిమా ఎలా ఉన్నా సరే ప్రమోట్ చేసేద్దామన్న ఉద్దేశం నాకు లేదు. సినిమా గురించి తెలియకుండా ప్రమోట్ చేస్తే తర్వాత నా క్రెడిబిలిటీ దెబ్బ తింటుంది. నాకు ఈ కథ ఎనిమిది నెలల కిందటే తెలుసు. ఐతే కథ బాగుంది. దీన్ని సరిగ్గా తీస్తే దగ్గరుండి ప్రమోట్ చేస్తా అని చెప్పాను. సినిమా పూర్తయ్యాక చూశాను. చాలా బాగా నచ్చింది. దీంతో ముందు మాట ఇచ్చినట్లే సపోర్ట్ చేస్తున్నాను. ఇది చిన్న సినిమానే కానీ.. ప్రయత్నం చిన్నది కాదు. నేను మాట్లాడితే సినిమాకు మంచి జరుగుతుందనిపిస్తే తప్పకుండా ఆ సినిమాకు ప్రచారం చేస్తా’’ అని నాగ్ అన్నాడు.

Tags:    

Similar News