నిఖిల్ ముద్ర.. ఎందుకింత లేటు?

Update: 2018-10-31 08:12 GMT
యువ కథానాయకుడు నిఖిల్ కెరీర్ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిఖిల్.. ఆ తర్వాత ‘కేశవ’.. ‘కిర్రాక్ పార్టీ’ సినిమాలతో నిరాశ పరిచాడు. ఈ రెండు సినిమాలు అతడి మార్కెట్‌ ను దెబ్బ తీశాయి. దీంతో ఈసారి చాలా శ్రద్ధతో ‘ముద్ర’ సినిమా చేస్తున్నాడు. ఇది తమిళంలో విజయవంతమైన ‘గణిదన్’ సినిమాకు రీమేక్. ఒరిజినల్ డైరెక్టరే రూపొందిస్తున్నాడు. సినిమా మొదలై ఏడెనిమిది నెలలైంది. రీమేక్ సినిమాలు తీయడం చాలా సులువైన పని. పైగా మాతృక తీసిన దర్శకుడే డైరెక్ట్ చేస్తుంటే పని మరింత సులువవుతుంది. స్క్రిప్టులో పెద్దగా మార్పులు కూడా చేయలేదని అంటున్నారు. అలాంటపుడు సినిమా ఇంకా పూర్తి కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

నిజానికి ముందు అనుకున్న ప్రకారం అక్టోబరులోనే ఈ చిత్రం రిలీజ్ కావాలి. కానీ రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు మారుస్తూ వెళ్తున్నారు. డిసెంబరు 7న రిలీజ్ చేయబోతున్నట్లు చివరగా సంకేతాలిచ్చారు. ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా రావట్లేదని అంటున్నారు. డిసెంబరు నెలాఖరుకు ‘ముద్ర’ వాయిదా పడిందట. మరి అప్పుడైనా సినిమా పక్కాగా వస్తుందో రాదో తెలియదు మరి. ఈ చిత్రానికి టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి కావచ్చినట్లు చెబుతున్నారు. ఇటీవలే ‘పందెంకోడి-2’తో పలకరించిన ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నిఖిల్ సరసన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఇందులో నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం మీద పోరాడే జర్నలిస్టు పాత్రలో నిఖిల్ నటిస్తున్నాడు. తమిళంలో అధర్వ, కేథరిన్ థ్రెసా జంటగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ పెద్ద విజయమే సాధించింది.

Tags:    

Similar News