పవన్‌ కల్యాణ్‌ నిర్మాతల్లో ఆందోళనకు కారణం ఇదేనా?

Update: 2022-05-18 05:34 GMT
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు.. ఇలా రెండు పడవల మీద విజయవంతంగా ప్రయాణిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ గత రెండు చిత్రాలు.. వకీల్‌ సాబ్, భీమ్లా నాయక్‌ సూపర్‌ హిట్లుగా నిలిచాయి.

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌.. క్రిష్‌ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌ సింగ్, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రంలో, సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయ సీతం' రీమేక్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్‌సింగ్‌ చిత్రాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి.

మరోవైపు పవన్‌.. జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్‌ను చుట్టేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక పంటలు పండక, గిట్టుబాటు ధర లభించక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున పవన్‌ తన సొంత నిధులను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటì ంచిన పవన్‌ ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.

ఇక రానున్న రోజుల్లోనూ ఎక్కువ భాగం ప్రజల్లోనే ఉండాలని పవన్‌ నిర్ణయించుకున్నారు. ఎందుకంటే 2024లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రతిపక్ష కూటమి పొత్తులతో బలపడక ముందే అంటే వచ్చే ఏడాదిలో ఎన్నికలకు వెళ్లాలని జగన్‌ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలా జరిగితే పవన్‌ కల్యాణ్‌ పూర్తి సమయం రాజకీయాలకు వెచ్చించక తప్పదు.

ఇప్పుడు ఇదే పవన్‌ కల్యాణ్‌తో చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాతలకు ఆందోళన పెంచుతోంది. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్‌సింగ్, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తాళ్లూరి రామ్‌ నిర్మిస్తున్న చిత్రం, సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న చిత్రాలతోపాటు మరికొన్ని చిత్రాల్లోనూ నటించడానికి పవన్‌ అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో బిజీ అయిపోతే ఈ సినిమా షూటింగులన్నీ తాత్కాలికంగా వాయిదా పడటం ఖాయం.

దీంతో వీలైనంత తొందరగా పవన్‌ కల్యాణ్‌తో సినిమాలు పూర్తి చేయాలనే ఆలోచనతో దర్శకనిర్మాతలు ఉన్నారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ కూడా నిర్మాతలు నష్టపోకుండా త్వరగా సినిమా షూటింగ్‌లు పూర్తి కావడానికి తన సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చినట్టు టాలీవుడ్‌ సమాచారం.
Tags:    

Similar News