రిపబ్లిక్' ఓటీటీ రిలీజ్ సెలబ్రేషన్స్ లో సాయి తేజ్..!

Update: 2021-11-26 12:30 GMT
సుప్రీమ్ హీరో సాయి తేజ్ - 'ప్రస్థానం' ఫేమ్ దేవకట్టా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ''రిపబ్లిక్''. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే ఈ చిత్రాన్ని ఈరోజు శుక్రవారం డిజిటల్ వేదిక మీదకు తీసుకొచ్చారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

'రిపబ్లిక్' సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న మెగా హీరో.. మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనలేక పోయారు. అంతేకాదు థియేటర్లలో ఈ సినిమాని చూడలేకపోయారు. అయితే ఈరోజు జీ 5లో స్ట్రీమింగ్ కావడంతో దర్శకుడు దేవకట్టా మరియు చిత్ర బృందంతో కలిసి తేజ్ తన ఇంట్లో సినిమా చూశారు. ఈ సందర్భంగా ఆయనతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు. ఈ విషయాన్ని మెగా మేనల్లుడు సోషల్ మీడియాలో వెల్లడించారు.

''ముందుగా 'రిపబ్లిక్' సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు అందరికీ ధన్యవాదాలు. పంజా అభిరామ్ పాత్ర పోషించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మీ అందరితో సినిమా చూడటం నాకు చాలా ప్రత్యేకమైనది. నేను టీమ్ తో కలిసి చూస్తున్నాను. మీరందరూ నాతో చేరిందందుకు సంతోషిస్తున్నాను'' అని సాయి తేజ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు.

కాగా, 'రిపబ్లిక్' చిత్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి శాసన కార్య న్యాయ శాఖలతో పాటుగా ప్రజల పాత్ర ఎంటనేది చూపించారు. రాజకీయ నాయకుల కనుసన్నలలో ప్రభుత్వ అధికారులు పని చేయడాన్ని ఎత్తి చూపుతూ.. దారితప్పిన ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టడానికి ఓ యువ ఐఎఎస్ అధికారి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? దాని పర్యవసానం ఏంటి? అనేది దేవ కట్ట తనదైన శైలిలో తెరకెక్కించారు.

ఇందులో పంజా అభిరామ్ పాత్రలో సాయి తేజ్ నటించగా.. ఐశ్వర్య రాజేష్ - రమ్యకృష్ణ - జగపతిబాబు - సుబ్బరాజు - రాహుల్ రామకృష్ణ - పోసాని కృష్ణమురళి - శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.  జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు 'రిపబ్లిక్' చిత్రాన్ని నిర్మించారు.
Tags:    

Similar News