ఫిలింఫేర్ అవార్డ్.. 30 వేలకు కొన్నాడట

Update: 2017-01-19 04:34 GMT
బాలీవుడ్ లో వెనుకటి తరం స్టార్ హీరోల్లో రిషి కపూర్ ఒకరు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్డంలో.. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో ఈయనకు సాటి రాగల స్టార్లు దరిదాపుల్లో ఉండరు. తాజాగా ఈయన 'ఖల్లాంఖుల్లా' అంటూ తన ఆత్మకథను రాశారు. అందులో ఫిలింఫేర్ అవార్డ్ గురించి ఈయన చెప్పిన వాస్తవం సంచలనం అయిపోతోంది.

1973లో రిషి కపూర్ నటించిన బాబీ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారాయన. బాబీ చిత్రం కూడా సూపర్ హిట్ అయినా.. అదే ఏడాది రిలీజ్ అయిన అమితాబ్ బచ్చన్ మూవీ జంజీర్ బ్లాక్ బస్టర్ అయింది. బిగ్ బీకి కాకుండా.. రిషి కపూర్ కి ఫిలింఫేర్ దక్కడం అప్పట్లో హాట్ టాపిక్. ఇప్పుడా అవార్డు కొనుక్కున్నదే అంటూ బాంబు పేల్చారు రిషికపూర్.

'1974లో బాబీ చిత్రం కోసం రూ. 30 వేలు పోసి ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డ్ కొనుక్కున్నాను. ఆ తర్వాత నేను చేసిన పనికి బాగా సిగ్గేసింది. అప్పట్లో నేను 20ల్లో ఉండేసరికి పెద్దగా లోకజ్ఞానం లేక అలా చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ అలా చేయలేదు' అని చెప్పారు రిషికపూర్.

ఆ అవార్డు కొనుక్కున్నట్లు చెప్పినంత మాత్రాన తాను అందుకున్న అవార్డులన్నీ ఆ బాపతువే అనుకోవద్దని కూడా చెప్పారాయన. అయితే.. 43 ఏళ్ల క్రితమే ఫిలింఫేర్ అవార్డును కొనుక్కునే అవకాశం ఉంటే.. ఇప్పుడెలాంటి పరిస్థితులు ఉన్నాయో అనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. ఏకంగా ఫిలింఫేర్ అవార్డులకే మచ్చ వచ్చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News