లావైనందుకు నాకేదీ అవార్డంటున్నాడు

Update: 2016-02-02 15:30 GMT
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ రిషి కపూర్ సెన్సేషనల్ కామెంట్స్ కు పెట్టింది పేరు. మనసుకు ఏమనిపిస్తే అది అనేస్తుంటాడు రిషి. తన కొడుకు రణబీర్, అతడి ప్రేయసి కత్రినా కైఫ్ ల గురించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇంకా బాలీవుడ్ లో అనేక పరిణామాలపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఫోకస్ పరిణీతి చోప్రా మీద పడింది. ఈ బొద్దుభామ ఈ మధ్య కొవ్వంతా కరిగించేసి సన్నగా తయారైన సంగతి తెలిసిందే. ఆమె పడ్డ కష్టాన్ని గుర్తించి ఓ సంస్థ అవార్డు ఇచ్చింది. దాన్ని రిషి కపూర్ తప్పుబట్టాడు. ‘‘కేవలం సన్నబడ్డందుకు పరిణీతికి అవార్డిచ్చేస్తారా? మరి నేను కూడా ఎంతో కష్టపడి లావయ్యాను. మరి నాకు అవార్డివ్వరా?’’ అని ప్రశ్నించాడు రిషి.

మరోవైపు తాను ఇప్పటిదాకా అందుకున్న అవార్డులన్నీ వేస్టే అన్నట్లు మాట్లాడాడు రిషి. అవార్డులు తనకు డోర్ స్టెప్స్ తో సమానమని.. ఈ మధ్య కూడా తనకిచ్చిన ‘లైఫ్ టైం అచీవ్ మెంట్’ అవార్డును బలవంతంగా కట్టబెట్టారని వ్యాఖ్యానించాడు రిషి కపూర్. సినిమాల్లో తన పనైపోయిందని.. ఇక తాను ఏమీ సాధించలేను అనే ఉద్దేశంతో తనకు ‘లైఫ్ టైం అచీవ్ మెంట్’ అవార్డులు ఇస్తున్నారని.. కానీ తాను ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ యాక్టివ్ గానే ఉన్నానన్న సంగతి మరిచిపోతున్నారని రిషి ఎద్దేవా చేశాడు. ఇప్పటిదాకా తాను నాలుగో, ఐదో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులందుకున్నానని.. కానీ తన దృష్టిలో ఆ అవార్డులకు ఏమాత్రం విలువ లేదని ఆయన అభిప్రాయపడ్డాడు.
Tags:    

Similar News