ఆర్పీ.. ఇలాంటి సినిమాలెందుకు చెప్మా?

Update: 2016-06-07 13:30 GMT
ఆర్పీ పట్నాయక్ ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్. చేతి నిండా అవకాశాలతో.. స్టార్ హీరోల సినిమాలకు కూడా పని చేస్తూ ఫుల్ బిజీగా ఉండేవాడు ఆర్పీ. కానీ నటన మీద.. దర్శకత్వం మీద మక్కువ సంగీత దర్శకుడిగా అతడి కెరీర్ ను బాగా దెబ్బ తీసింది. మ్యూజిక్ డైరెక్టర్‌ గా తీరిక లేకుండా పని చేసుకుంటున్న టైంలో నటుడిగా మారి చేసిన ‘శ్రీను వాసంతి లక్ష్మి’ సినిమా తీవ్రంగా నిరాశ పరచడమే కాదు.. సంగీత దర్శకుడిగా ఆర్పీ అవకాశాలకు గండి కొట్టింది. ఆ తర్వాత ఆర్పీ మెగా ఫోన్ ముచ్చటా తీర్చుకున్నాడు. ‘అందమైన మనసులో’ అనే సినిమా తీశాడు. అదీ ఫ్లాపే అయింది. అయినా ఆర్పీ పట్టు వదల్లేదు.

బ్రోకర్ సినిమాతో నటుడిగా.. దర్శకుడిగా రెండు విధాలా ప్రయత్నం చేశాడు. ఉన్నంతలో అది బెటర్ సినిమా అనిపించుకుంది కానీ.. సక్సెస్ మాత్రం అందించలేదు. ఆ తర్వాత ‘ఫ్రెండ్స్ బుక్’ అని.. ‘తులసీదళం’ అని సినిమాలు చేసుకుంటూ పోయాడు. పోను పోనూ ఔట్ పుట్ మరింత నాసిరకంగా మారింది కానీ.. ప్రయోజనం లేదు. మధ్యలో కన్నడలోనూ ప్రయత్నాలు చేశాడు కానీ.. అక్కడా అదే రిజల్ట్ వచ్చింది. అయినప్పటికీ ఆర్పీలో ఏ మార్పూ లేదు. నిర్మాతల్ని ఎలా మెప్పిస్తున్నాడో కానీ.. తాజాగా ‘మనలో ఒకడు’ అంటూ ఇంకేదో సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆర్పీ లెక్చరర్ పాత్ర చేస్తున్నాడు. సంగీత దర్శకుడిగా ఆర్పీ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ‘నువ్వు నేను’లో హీరోయిన్ గా నటించిన అనిత ఇందులో ఆయనకు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు అవీ చూస్తుంటే ఆర్పీ దశ తిరిగే అవకాశాలేమీ కనిపించడం లేదు. తన బలమైన సంగీతాన్ని వదిలేసి.. తనకు కలిసిరాని విభాగాల్లో ఆర్పీ ఇలా ఎందుకు కష్టపడుతున్నాడో అర్థం కాని విషయం.
Tags:    

Similar News