తెలుగు రాష్ట్రాల్లో 7 రోజులు హౌస్ ఫుల్ అయితే.. ఆర్ఆర్ఆర్ ఖర్చు వచ్చేసినట్లే

Update: 2022-03-20 23:30 GMT
అటు సినీ పరిశ్రమ.. ఇటు ప్రేక్షకుల అందరి నోట నడుస్తున్న చర్చ ఆర్ఆర్ఆర్ మూవీ గురించే. ఈ శుక్రవారం విడుదలయ్యే ఈ మూవీ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ విదేశాల్లోనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చౌకైన వినోదాన్ని అందించటమే లక్ష్యమని చెప్పే జగన్ సర్కారు సైతం.. ఆర్ఆర్ఆర్ కోసమని తన సిద్ధాంతాన్ని.. ఫిలాసఫీని మార్చుకొని మరీ టికెట్ల ధరల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలోనే అంతటి విప్లవాత్మక నిర్ణయాన్ని జగన్ సర్కారు తీసుకుంటే.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు మౌనంగా ఎందుకు ఉంటారు చెప్పండి. అందులోకి అడిగినంతనే కాదనకుండా.. ఈ మధ్యనే పెంచిన టికెట్ల ధరలకు మరింత పెంచుకునేలా ప్రత్యేక పవర్ ను ఇచ్చేస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేశారు.

దీంతో.. ఈ సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని అంటిన పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఈ సినిమా కోసం డిసైడ్ చేసిన టికెట్ ధరల్ని చూసినప్పుడు.. కాసింత విస్మయం చెందాల్సిందే. అయినా.. జక్కన్న లాంటి దర్శక ధీరుడు సీన్లోకి దిగిన తర్వాత.. ఆయన కోరుకున్నట్లే టికెట్ ధరల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో.. ఒక రోజులో ఒక్క తెలుగు రాష్ట్రాల కలెక్షన్ రూ.40 నుంచి రూ.50 మధ్య ఖాయంగా ఉంటుందంటున్నారు. అంటే.. వారం పాటు హౌస్ ఫుల్ గా ఆడితే ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్లు దాటిపోతాయని.. అంటే.. ఒక్క తెలుగు లోనే ఈ చిత్రం సాధించే వసూళ్లతోనే సినిమా బడ్జెట్ మొత్తం తిరిగి వస్తుందని చెబుతున్నారు.

ఇక.. సౌత్ లోని తమిళనాడు.. కర్ణాటక.. కేరళ.. ఉత్తరాదిలో ఈ సినిమా చేసే రచ్చ దెబ్బకు మొదటి వారంలోనే రికార్డు వసూళ్లు రావటం ఖాయమంటున్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమా మాత్రమే కాదు.. బాలీవుడ్ మూవీ సైతం సాధించలేని సంచలన కలెక్షన్లను ఆర్ఆర్ఆర్ సాధిస్తుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News