భారతీయ సినీ హిస్టరీలోనే అత్యధిక స్క్రీన్లలో RRR..?

Update: 2021-11-17 16:30 GMT
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్. ఆర్'' (రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2022 జనవరి 7వ తేదీన విడుదల చేస్తున్నారు. అయితే ఇది భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవనుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

RRR చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీతో పాటుగా పలు విదేశీ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 స్క్రీన్లలో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా యూఎస్ఏలోనే సుమారు 2500 స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శించబడుతుందని అంటున్నారు.

కాగా, అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథాంశంతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామరాజు గా చరణ్.. భీమ్ గా తారక్ కనిపించనున్నారు. అలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్ - సముద్ర ఖని - శ్రియా - రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు.  

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో RRR చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయజేంద్ర ప్రసాద్ దీనికి కథ అందించారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు - టీజర్లు - పాటలకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News