ఆలస్యమైతే పెట్టుబడి కూడా కష్టమే.. నిర్మాతల టెన్షన్!

Update: 2020-06-13 10:10 GMT
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. స్టార్ హీరోలు ఎన్టీఆర్.. రాంచరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక హీరోయిన్లుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ లతో పాటు అజయ్ దేవగన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇంత భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ సినిమా నిర్మాత దానయ్యకి ప్రస్తుతం టెన్షన్ మొదలైందట. దానికి కారణం ఆర్ఆర్ఆర్ భవిష్యత్ ఏంటనే ప్రశ్న. అనుకున్న సమయానికంటే ఈ సినిమా దాదాపు ఏడాది ఆలస్యంగా రానుందని టాక్ నడుస్తుంది.

లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ముందే చెప్పినట్లుగా 2021 జనవరిలో విడుదల అయ్యే అవకాశం కనిపించలేదట. సినిమా షూటింగ్ లేటయ్యే కొద్దీ నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. సినిమా విడుదల ఆలస్యం అవుతుంటే పెట్టుబడి పై వడ్డీ భారం తడిసి మోపెడు అవుతుందని.. ఇప్పటికే వందల కోట్లు ఈ చిత్రం నిర్మాణం కోసం నిర్మాతలు వెచ్చించారట. ఇక బయట షూటింగ్స్ నిర్వహించే పరిస్థితి లేని కారణంగా భారీ సెట్స్ నిర్మించి షూటింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఖరీదైన సెట్స్ కోసం మరికొన్ని కోట్ల అదనంగా ఖర్చు కానుందట. కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోతే థియేటర్స్ తెరుచుకుంటాయా..? తెరుచుకున్నా లాక్ డౌన్ ముందులా జనాలు థియేటర్లకు వస్తారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినీ ప్రేక్షకులలో మహమ్మారి పై పూర్తిగా భయం పోయినప్పుడు మాత్రమే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాకు వందల కోట్ల వసూళ్లు సాధ్యం. లేదంటే పెట్టుబడిని రికవరీ చేయడమే కష్టం. ఒకవేళ థియేటర్స్ తెరచుకోక పోతే ఓటిటి ద్వారా ఇన్ని వందల కోట్ల పెట్టుబడి రాబట్టడం సాధ్యమైన పని కాదు. ప్రస్తుతం ఇన్ని సవాళ్లు ఆర్ఆర్ఆర్ దర్శక నిర్మాతల ముందున్నాయి.
Tags:    

Similar News