మంచి నిర్మాతకు మరో దెబ్బ

Update: 2018-07-15 06:52 GMT
తొలి సినిమా ‘ఈగ’తోనే తన అభిరుచి ఏంటో చాటిచెప్పాడు సాయి కొర్రపాటి. ఒక ఈగను హీరోను చేసి రాజమౌళి తీసిన ఈ చిత్రంపై ఆయన ఎంతో నమ్మకం పెట్టాడు. జక్కన్నను నమ్మి రాజీ లేకుండా భారీ ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించాడు. అది చూసే రాజమౌళికి ఆయనపై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ‘ఈగ’ తర్వాత ‘అందాల రాక్షసి’.. ‘ఊహలు గుసగుసలాడే’.. ‘దిక్కులు చూడకు రామయ్యా’.. ‘లెజెండ్’ లాంటి సినిమాలతో నిర్మాతగా తనదైన ముద్ర వేశాడు సాయి. కానీ ఆ తర్వాత ఆయన ట్రాక్ తప్పాడు. వారాహి బేనర్ నుంచి వచ్చిన సినిమాలు వరుసగా బోల్తా కొట్టడం మొదలైంది. వెరైటీ కాంబినేషన్లో మంచి సినిమాలే చేస్తున్నాడు కానీ.. ఆయన ఆశించిన ఫలితాలు మాత్రం రావట్లేదు. ‘తుంగభద్ర’.. ‘మనసంతా’.. ‘పటేల్ సార్’.. ‘యుద్ధం శరణం’.. ఇలా సాయి ఫ్లాపుల పరంపర నిరాటంకంగా కొనసాగుతోంది.

మధ్యలో ‘జ్యో అచ్యుతానంద’ ఒక్కటే ఆయనకు కొంత ఉపశమనం అందించింది. మిగతావన్నీ సాయికి భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు సాయి నుంచి ‘విజేత’ సినిమా వచ్చింది. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్‌ ను హీరోగా పరిచయం చేస్తూ రాజీ లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు సాయి. ‘బాహుబలి’ లాంటి భారీ సినిమాకు ఛాయాగ్రహణం అందించిన సెంథిల్ కుమార్‌ ను ఛాయాగ్రాహకుడిగా పెట్టుకున్నాడంటే ఆయన ఈ సినిమాకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అంత ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఇప్పుడు రిజల్ట్ చూస్తే దిమ్మదిరిగిపోతోంది. పెట్టుబడిలో పదో వంతు కూడా ఇప్పటిదాకా వసూలు కాలేదు. సినిమాకు పేలవమైన టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ లేవు. పబ్లిసిటీ ఖర్చులు రికవర్ కావడమే కష్టంగా ఉంది. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా ఇది మరో గట్టి దెబ్బే. ఈ పరిస్థితుల్లో ఇక ఆయన కోలుకోవడం కష్టమే అంటున్నారు.
Tags:    

Similar News