మాటలా.. అవి తూటాలా?

Update: 2017-01-12 10:32 GMT
‘‘సమయం లేదు మిత్రమా.. రణమా.. శరణమా’’ అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ట్రైలర్లో ‘‘దేశం మీసం తిప్పుదాం’’ అన్న డైలాగ్ కూడా వారెవా అనిపించింది. ఇవి కేవలం శాంపిల్స్ మాత్రమే. సినిమా చూస్తే తెలుస్తుంది సాయిమాధవ్ బుర్రా కలానికి ఇంకెంత పదునుందో!

ఒకటా రెండా.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో సాయిమాధవ్ బుర్రా పేల్చిన మాటల తూటాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి సన్నివేశానికీ మాటలు బలంగా నిలిచాయి. అంతగా ఆసక్తి రేకెత్తించని సన్నివేశాలకు కూడా తన మాటలతో బలం చేకూర్చాడు సాయిమాధవ్. ఎంతో నిగూఢార్థం ఉన్న మాటలతో సినిమా స్థాయిని ఎంతో పెంచాడతను. అలాగని అర్థం కాని విధంగానూ లేవు మాటలు. పాండిత్య ప్రదర్శన చేయకుండా అందరికీ అర్థమయ్యేలా సంభాషణలు రాశాడు సాయిమాధవ్. అతడి మాటల్ని బాలయ్య అద్భుతంగా పలికి వాటికి మరింత విలువ చేకూర్చాడు.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక నేపథ్యంలో ఉన్న సినిమాలో సైతం ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునే మాటలు రాయడం బుర్రాకే చెల్లింది. ఓ సన్నివేశంలో శత్రు రాజు తన ఓటమిని అంగీకరించి శాతకర్ణి ముందు తలవంచి మోకాలిపై నిలబడితే.. ‘‘తల వంచకు.. అది నేను గెలిచిన తల’’ అంటాడు శాతకర్ణి. థియేటర్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడూ శభాష్ అనుకునే డైలాగ్ ఇది. సినిమాలో ఇలాంటి తూటాల్లాంటి మాటలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ ఇక్కడ చెప్పుకుంటూ పోతే థ్రిల్ పోతుంది. కాబట్టి సాయిమాధవ్ మాటల పదునేంటో తెలియాలంటే సినిమా చూడాలి. ఇప్పటికే కృష్ణం వందే జగద్గురుం.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. కంచె లాంటి సినిమాలతో రచయితగా తన స్థాయి ఏంటో చూపించాడు సాయిమాధవ్. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో మరింత గొప్ప స్థాయిని అందుకున్నాడతను. సాహో సాయిమాధవ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News