ఏఎన్నార్‌ తో ఆ సినిమా చేసి ఉంటే..

Update: 2016-11-06 07:30 GMT
సాయిరాం శంకర్.. పూరి జగన్నాథ్ తమ్ముడిగా తెరంగేట్రం చేశాడు. ‘143’ లాంటి వైవిధ్యమైన సినిమాతో హీరోగా పరిచయమైన సాయిరాం.. హీరోగా నిలదొక్కుకోవడానికి దశాబ్దంన్నర నుంచి పోరాడుతున్నాడు. మధ్యలో ‘బంపర్ ఆఫర్’ లాంటి ఒకట్రెండు హిట్టు సినిమాలు పడ్డా అతను నిలదొక్కుకోలేకపోయాడు. ఇప్పుడు అతడి కెరీర్ బాగా దెబ్బ తినేసింది. పూరి బ్యాకప్ ఉన్నా కూడా సాయిరాం ఈ స్థితిలో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే కెరీర్లో తాను వేసిన పెద్ద తప్పటడుగు వల్లే తన కెరీర్ దెబ్బ తిందని అంటున్నాడు సాయిరాం. ఆ తప్పటడుగు ఏంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘బంపర్ ఆఫర్ హిట్టయ్యాక నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఐతే వాటన్నింటినీ కాదని ఒక పెద్ద ప్రాజెక్టు చేయడానికి అంగీకరించాను. ఒక పెద్ద నిర్మాత అక్కినేని నాగేశ్వరరావు గారు.. శ్రీహరి గారు.. నా కాంబినేషన్లో పెద్ద సినిమా చేద్దాం అన్నాడు. దాని కోసం అన్నీ పక్కనబెట్టాను. నాగేశ్వరరావు గారు అప్పట్లో గడ్డం పెంచడం గుర్తుండే ఉంటుంది. మా సినిమా కోసమే ఆయన లుక్ మార్చుకున్నారు. అదే తన చివరి సినిమా అని.. ఆ తర్వాత నటించనని కూడా ఏఎన్నార్ గారు అన్నారు. కానీ ఆ సినిమా ఇదిగో అదిగో అనుకుంటూ 9 నెలలు గడిచిపోయింది. చివరికి ఆ నిర్మాత ఆ సినిమా చేయనంటూ చేతులెత్తేశాడు. నిజానికి అన్నయ్య మొదట్లోనే అతను సినిమా చేయడురా అని చెప్పారు. కానీ నేను నమ్మాను. దాని వల్ల చాలా అవకాశాలు కోల్పోయాను. ఒక హిట్టు వచ్చాక గ్యాప్ తీసుకోకూడదని అప్పుడే నాకు అర్థమైంది’’ అని సాయిరాం చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News