శైల‌జారెడ్డి సాంగ్స్ ఇక‌ ఇంతేనా?

Update: 2018-08-17 16:18 GMT
ఇటీవ‌లి కాలంలో సింగిల్స్ రిలీజ్ పేరుతో ఒక్కో పాట‌ను రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేసే ప్ర‌య‌త్నం సాగుతోంది. ఇలా సింగిల్స్ పేరుతో ప్ర‌తిసారీ ఉచిత‌ ప్ర‌చారం కొట్టేయాల‌న్న ప్లాన్ బాగానే ఉన్నా - అది అంద‌రికీ వ‌ర్క‌వుట్ కాలేద‌న్న మాటా అంతే బిగ్గ‌ర‌గా వినిపిస్తోంది. కొంద‌రికి ఇది లాభం అయితే - మ‌రికొంద‌రికి న‌ష్టాన్ని క‌ల‌గ‌జేస్తోంది. ఇదివ‌ర‌కూ `గీత గోవిందం` సింగిల్స్ రిలీజ్ చేసిన‌ప్పుడు అది ఆ సినిమాకి క‌లిసొచ్చింద‌న్న‌ది నిర్వివాదాంశం. పాట‌ల్లో విష‌యం ఉంది కాబ‌ట్టి శ్రోత‌లు మెచ్చారు. అయితే ఆ ఫార్ములా అన్ని సినిమాల‌కు క‌లిసి రాద‌ని ప్రూవ్ అవుతోంది. శైల‌జారెడ్డి అల్లుడు పాట‌లే అందుకు ఎగ్జాంపుల్‌.

ఈ సినిమా నుంచి 6 సింగిల్స్ రిలీజ్ కానున్నాయి. వీటిలో ఇప్ప‌టికే మూడింటిని రిలీజ్ చేసేశారు. అయితే ఇవేవీ పెద్దంతగా శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకోలేద‌న్న స‌మీక్ష‌లు వెలువ‌డుతున్నాయి. ఒక్కో పాట‌లో మైన‌స్ పాయింట్స్‌ ని వేలెత్తి చూపిస్తున్నారంతా. అనూ బేబి సాంగ్‌ లో చైతూ కొత్త స్టెప్పులు వేసేందుకు ట్రై చేసినా ట్యూన్‌ లో మాత్రం ఏమంత కొత్త‌ద‌నం లేద‌న్నారు. తాజాగా రిలీజైన ``ఛంఛం ప‌ల్‌ ప‌రి జాత‌ర చూడే.. `` అంటూ సాగే శైల‌జారెడ్డి టైటిల్‌ పాట రిలీజైనా ఇది కూడా అంతంత మాత్ర‌మేన‌న్న టాక్ వినిపిస్తోంది. పాట‌లో టోన్ బావున్నా.. ట్యూన్ రొటీన్‌ గానే ఉంద‌న్న మాట వినిపించింది. మొత్తానికి మ‌న సినిమాల్లో మ్యూజిక్ లో ఇన్నోవేష‌న్ లేద‌న్న సంగ‌తిని ఇట్టే ఈ సింగిల్స్ రివీల్ చేస్తున్నాయ‌ని స‌మీక్ష‌కులు విమ‌ర్శ‌లు రువ్వుతున్నారు.

కేవ‌లం శైల‌జారెడ్డి సింగిల్స్‌నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవాల్సిన ప‌నేలేదు. ఇటీవ‌లి కాలంలో రిలీజ్‌కి వ‌చ్చిన‌ డ‌జ‌ను సినిమాల్ని ప‌రిశీలిస్తే - వీటిలో పాట‌ల ప‌రంగా మెప్పించేవి ఏ రెండు మూడు సినిమాలో. అలానే ఆల్బ‌మ్‌ లోని పాట‌ల‌న్నీ మెప్పించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఏదో ఒక పాట మెరిపించినా మిగ‌తావి తుస్సుమ‌నిపోతున్నాయి. మ‌న మ్యూజిక్ డైరెక్ట‌ర్లంతా.. ఇళ‌య‌రాజా - ఏ.ఆర్‌.రెహ‌మాన్ త‌ర‌హాలో శూన్యం నుంచి సంగీత‌ధ్వ‌నుల్ని వినిపించ‌డం కుద‌ర‌దేమో? అందుకే అప్ప‌టికే వినేసిన పాట‌ల్లా వినిపిస్తున్నాయ్ ఇవ‌న్నీ.



Tags:    

Similar News