విపత్కర పరిస్థితుల్లో సల్మాన్ పెద్ద మనసు..!

Update: 2021-05-19 17:30 GMT
కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో పాటు వేలల్లో ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికే ఎన్నో కుటుంబాలలో మహమ్మారి వైరస్ చీకటిని నింపింది. ఇప్పుడు వైద్యానికి అత్యంత ప్రాధాన్య‌త పెరిగింది. అయితే ఆసుపత్రిలో బెడ్స్.. ఆక్సిజన్ సిలిండర్స్ దొరకని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమవంతు సహాయం చేస్తున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా సాయం చేయడానికి ముందుకొచ్చారు.

ముంబై ప్రాంతంలో కోవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు సల్మాన్. అవసమైన వాళ్ళు కాల్ చేయాలని చెబుతూ ఓ ఫోన్ నెంబర్ ని కూడా ఇచ్చాడు. ''మొదటి 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ ముంబైకి చేరుకున్నాయి. అత్యవసర పరిస్థితిలో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్
అవసరమయ్యే కోవిడ్ పాజిటివ్ రోగులు 8451869785 కు కాల్ చేయవచ్చు. లేదా మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేయవచ్చు. మేము వీటిని ఉచితంగా అందిస్తాం. దయచేసి వాటిని ఉపయోగించిన తర్వాత తిరిగి ఇవ్వాలని కోరుతున్నాను'' అని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.

ఇంతకముందు సినీ పరిశ్రమలోని రోజువారీ కార్మికులకు సల్మాన్ ఆర్థిక సాయం చేశారు. దాదాపు 25వేల మంది దినసరి వేతన కార్మికులకు రూ.1,500 చొప్పున నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇందుకోసం ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్టర్న్‌ ఇండియన్‌ సినీ ఎంప్లాయీస్‌ (FWICE)ను సంప్రదించి కార్మికుల బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు. ఇకపోతే ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ అబ్బాయి తన తండ్రి కొవిడ్‌-19తో మరణించాడని.. సాయం చేయమని ట్విటర్‌ ద్వారా సల్మాన్‌ ను కోరాడు. దీనికి సల్మాన్‌ స్పందించి, ఆ అబ్బాయి కుటుంబానికి కావలసిన ఆహార సామాగ్రిని సమకూర్చి.. అతని చదువుకు కావల్సిన సదుపాయాలు సమకూర్చారు.
Tags:    

Similar News