మాస్ ఆడియన్స్ రచ్చ చేసుకోవచ్చు..

Update: 2017-07-27 09:36 GMT
గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో మాస్ మసాలా సినిమాలు తగ్గిపోయాయి. స్టార్ హీరోలు సైతం వైవిధ్యమై.. క్లాస్ టచ్ ఉన్న సినిమాలే చేస్తున్నారు. దీంతో మాస్ ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురవుతున్నారు. తమ అభిరుచికి తగ్గ సినిమాలు రావట్లేదని ఫీలవుతున్నారు. ఐతే ఆ వర్గం ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసే హీరోలు.. దర్శకులు కూడా కొందరుంటారు. హీరో గోపీచంద్.. దర్శకుడు సంపత్ నంది ఆ కోవలోని వాళ్లే.

గోపీచంద్ సినిమాలు ఏ జానర్లో తెరకెక్కినా మాస్ ప్రేక్షకుల్ని అలరించే అంశాలకు లోటు లేకుండా చూసుకుంటాడు. అతడి మార్కు యాక్షన్ దృశ్యాలు.. హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాలు పక్కాగా ఉంటాయి. ఇక దర్శకుడు సంపత్ నంది శైలి ఏంటో తెలిసిందే. రామ్ చరణ్ తో అతను చేసిన మాస్ ‘రచ్చ’ ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాగే రవితేజతో ‘బెంగాల్ టైగర్’లోనూ మాస్ ఎంటర్టైన్మెంట్ అందించాడు సంపత్.

ఇప్పుడు గోపీ-సంపత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గౌతమ్ నంద’లో కూడా మాస్ వినోదానికి ఢోకా లేదని అంటున్నారు. ఈ చిత్ర టీజర్.. ట్రైలర్ చూసినా ఆ సంగతి అర్థమవుతుంది. గోపీ-సంపత్ గత సినిమాలతో పోలిస్తే ఇందులో కొంచెం క్లాస్ గా.. స్టైలిష్ గా కనిపిస్తున్న మాట వాస్తవమే. కానీ మాస్ మెచ్చే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయంటున్నారు హీరో.. దర్శకుడు.

రమణ మహర్షి మాటల ఆధారంగా మూల కథను రాసుకున్నప్పటికీ దానికి తనదైన శైలిలో వినోదపు పూత అద్దాడట సంపత్. వరుసగా నిన్ను కోరి.. ఫిదా లాంటి క్లాస్ సినిమాలే వస్తున్న సమయంలో ‘గౌతమ్ నంద’ రూపంలో తమ టేస్టుకు తగ్గ మాస్ టచ్ ఉన్న సినిమా రావడం ఆ వర్గం ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చే విషయమే. గోపీచంద్ సరసన హన్సిక.. కేథరిన్ థ్రెసా నటించిన ‘గౌతమ్ నంద’ను భగవాన్-పుల్లారావు నిర్మించారు.
Tags:    

Similar News