ఎన్టీఆర్ వెళ్లకున్నా సంపూర్ణేష్ వెళ్లాడు

Update: 2016-08-20 12:01 GMT
ఏపీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి వచ్చిన కృష్ణా పుష్కరాల కోసం ఏపీ ముఖ్యమంత్రి ఎంతగానో శ్రమిస్తున్నారు. పుష్కరాల్ని వేదికగా తీసుకొని పలువురు ప్రముఖుల్ని విజయవాడకు తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. తానే స్వయంగా పుష్కర ఆహ్వానాల్ని తీసుకొని రాష్ట్రపతి ప్రణబ్ మొదలు ప్రధాని మోడీ.. కేంద్రమంత్రులకు ఆహ్వానాలు ఇచ్చి వచ్చారు. పుష్కరాలు జరుగుతున్న తమ రాష్ట్రానికి రావాలంటూ రాజకీయనేతలతో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు.

ఈ ఇన్విటేషన్లు ఎంత వరకూ వెళ్లిందంటే సినిమా నటుల్లో సంపూర్ణేష్ బాబు వరకూ వెళ్లింది. పలువురు స్టార్లకు ఆహ్వానాలు పంపినట్లు ఏపీ నేతలు చెబుతున్నారు. గతకొంతకాలంగా మాటలు లేని ఎన్టీఆర్ (తారక్) కు సైతం ఇన్విటేషన్ ఇచ్చి వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకూ ఏ సినీ స్టార్ ఏపీకి వెళ్లి పుష్కరస్నానం చేసింది లేదు. తాజాగా తారక్ తల్లి పుష్కర స్నానం చేయగా.. ఎన్టీఆర్ వెళ్లలేదు.

ఇదిలా ఉంటే.. శనివారం విజయవాడలోని పున్నమి ఘాట్లో సినీ నటుడు సంపూర్ణేష్ బాబు పుష్కర స్నానం చేశారు. ఈ సంద్భంగా విజయవాడలో అతగాడ్ని చూసేందుకు పుష్కర స్నానానికి వచ్చిన యాత్రికులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. సంపూర్ణేష్ బాబును చూసేందుకు ప్రదర్శించిన ఉత్సాహాన్ని చూసిన కొందరైతే.. సంపూర్ణేష్ కు సైతం ఇంత క్రేజా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. పలువురు స్టార్ హీరోల్ని పిలిచినా ఏపీకి వెళ్లకున్నా.. తనను పిలిచినంతనే పుష్కరాలకు వెళ్లిన సంపూర్ణేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నదిలో పుష్కర స్నానం చేయటం తన అదృష్టంగా చెప్పారు. మరీ.. అదృష్టానికి మిగిలిన స్టార్స్ ఎందుకు దూరంగా ఉన్నట్లు..?
Tags:    

Similar News