తెలుగు నటినని ఆ దర్శకుడు ఏడిపించాడు

Update: 2018-11-11 07:20 GMT
తెలుగులో ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించిన సన ప్రస్తుతం బుల్లి తెరపై కూడా సందడి చేస్తున్నారు. అక్క, వదిన, అమ్మ, అత్త ఇలా అన్ని పాత్రల్లో ఒదిగి పోతున్న సన అసలు పేరు షానూర్‌ సన బేగం. నాగార్జున నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంతో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి - తన కెరీర్‌ లో ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి చెప్పుకొచ్చింది. మీటూ ఉద్యమం ఉదృతంగా ఈ సమయంలో మీరు ఏమైనా లైంగిక వేదింపులు ఎదుర్కొన్నారా అంటూ ప్రశ్నించగా కెరీర్‌ ఆరంభంలో పడ్డ ఇబ్బందులను సన చెప్పుకొచ్చారు.

ఒక కన్నడ దర్శకుడు నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆయన పెట్టిన ఇబ్బంది వల్ల నేను ఒక రోజంతా ఏడిచాను అంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో అప్పటికే చాలా సినిమాల్లో నటించిన నేను కన్నడంలో ఒక చిత్రంలో ఆఫర్‌ రావడంతో అక్కడకు వెళ్లాను. ఆ చిత్రం షూటింగ్‌ సమయంలో నన్ను దర్శకుడు టార్గెట్‌ చేశాడు. డైలాగ్‌ ఎంత పర్‌ ఫెక్ట్‌ గా చెప్పినా కూడా తిట్టాడని - పలు టేక్‌ లు చేయించాడని చెప్పుకొచ్చింది. కన్నడ సినిమా సినిమా పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన నటీనటులను కాస్త తేడాగా చూస్తారు. అలాగే నాకూ జరిగింది.

కన్నడంలో అంత మంది ఉండగా ఆ పాత్రకు నన్ను ఎంపిక చేయడం దర్శకుడికి అస్సలు ఇష్టం లేదు. దాంతో నన్ను చాలా ఇబ్బంది పెట్టే వాడు. పేజీ డైలాగ్స్‌ ఇచ్చి, సింగిల్‌ టేక్‌ లో చేయాలని చెప్పేవాడు. సింగిల్‌ టేక్‌ లో ఏదో ఒక విధంగా చెప్పినా ఏంటా భాష - ఏంటా ఎక్స్‌ ప్రెషన్స్‌ అంటూ తిట్టేవాడు. దాంతో చాలా సార్లు ఆయన వల్ల ఏడిచాను అంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో ఇన్నాళ్లుగా నటిస్తున్నా కూడా ఇక్కడ తనకు ఎలాంటి ఇబ్బంది కాలేదు అంది.

Tags:    

Similar News