‘అర్జున్ రెడ్డి’ దర్శకుడిని అంత ఏడిపించారా?

Update: 2017-09-09 09:22 GMT
‘అర్జున్ రెడ్డి’ మ్యూజిక్ విని.. అందులో ఛాయాగ్రహణం చూసి.. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా స్థాయే వేరని కొనియాడుతున్నారు. ఐతే వీటి విషయంలో తాను పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని అంటున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి. సినిమాటోగ్రాఫర్.. సంగీత దర్శకుడు ఇద్దరూ తనను ఇబ్బంది పెట్టినట్లు అతను చెప్పాడు. ఈ చిత్రానికి ముందు సినిమాటోగ్రాఫర్ గా ‘పెళ్లిచూపులు’ ఫేమ్ నగేష్ బానెల్ ను.. మ్యూజిక్ డైరెక్టర్ గా ‘అందాల రాక్షసి’ ఫేమ్ రదాన్ ను పెట్టుకున్న సందీప్.. తర్వాత వాళ్లిద్దరినీ వేరే వాళ్లతో రీప్లేస్ చేయాల్సి వచ్చిందట. సినిమాటోగ్రాఫర్ గురించి నెగెటివ్ కామెంట్స్ ఏమీ చేయలేదు కానీ.. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం సందీప్ తీవ్ర విమర్శలు గుప్పించాడు.

‘‘నగేష్.. రదాన్ ఇద్దరినీ నా హీరో విజయే రిఫర్ చేశాడు. ఇంకా కొందరు టెక్నీషియన్లను కూడా రిఫర్ చేశాడు. వాళ్ల విషయంలో ఇబ్బంది లేదు కానీ.. సినిమాటోగ్రాఫర్.. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. నగేష్ మంచి సినిమాటోగ్రాఫరే. కానీ నాకు అతడికి అసలేమాత్రం సింక్ అవ్వలేదు. నేను చెప్పే షాట్స్.. ఫ్రేమ్స్.. లెన్స్ ఏవీ కూడా అతడికి నచ్చేవి కావు. అతడి ఆలోచనలు పూర్తి భిన్నంగా ఉండేవి. దీంతో బాగా ఇబ్బంది అయ్యింది. అతను 16 రోజులు మా సినిమాకు పని చేశాడు. కానీ అందులో చాలా వరకు నేను పెట్టిన షాట్లే తీసుకున్నాను. అతను చేసినవి కొన్ని మాత్రమే సినిమాకు వాడుకున్నాను. అందుకే అతడికి సినిమాలో క్రెడిట్ ఇవ్వలేదు. ఓ దశ దాటాక ఇక కుదరదని భావించి తోట రాజును కెమెరామన్ గా తీసుకున్నాను. అతడితో నాకు ఏ రోజూ ఇబ్బంది రాలేదు.

ఇక సంగీత దర్శకుడు రదాన్ విషయానికొస్తే అతను నన్ను టార్చర్ పెట్టాడు. ఎప్పుడూ సమయానికి మ్యూజిక్ ఇవ్వలేదు. టీజర్ రిలీజ్ చేసే సమయానికి ఒక పాట కూడా రికార్డ్ చేయలేదు. సినిమాలో పాటలన్నీ సిచువేషన్ కు తగ్గట్లు వచ్చే మాంటేజెసే. అతను పాటలివ్వకుండా నేనెలా తీయను? అతను చేస్తున్న ‘రాధ’ సినిమా ప్రమోషన్ల కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వస్తే బలవంతంగా ఒకే రోజు రెండు పాటలు రికార్డ్ చేయించా. నేను పాటలకు సంబంధించి ఏదైనా రెఫరెన్సులిస్తే ఫీలయ్యేవాడు. కొన్నిసార్లు ఇంత క్లారిటీ ఉన్నపుడు రెఫరెన్స్ ఇవ్వొచ్చు కదా అనేవాడు. వెంట పడి వెంట పడి పాటలు చేయించుకున్నా. ఇక లాభం లేదని అతణ్ని పక్కన పెట్టి హర్షవర్ధన్ రామేశ్వర్ తో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకున్నాను. అతను నా ఆలోచనలకు తగ్గట్లుగా.. వేగంగా ఔట్ పుట్ ఇచ్చాడు’’ అని సందీప్ తెలిపాడు.
Tags:    

Similar News