మళ్లీ అర్జున్ రెడ్డి కాంబినేషన్?

Update: 2018-08-18 08:54 GMT
ఇంకో వారం గడిస్తే ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ఏడాది పూర్తవుతుంది. ఈ చిత్రం గత ఏడాది ఎంతటి సంచలనానికి తెర తీసిందో తెలిసిందే. బాలీవుడ్.. కోలీవుడ్.. ఇలా అన్ని వుడ్లూ టాలీవుడ్ వైపు చూసేలా చేసిన చిత్రమిది. తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందని అక్కడి వాళ్లెవ్వరూ ఊహించి ఉండరు. రాత.. తీతలో రూల్స్ అన్నీ బ్రేక్ చేసి సరికొత్తగా సాగిన ఈ చిత్రం మన ఇండస్ట్రీకి కూడా ఎన్నో పాఠాలు నేర్పింది. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ.. హీరోగా విజయ్ దేవరకొండల ప్రతిభ ఏంటన్నది ఈ సినిమా చూపించింది. వీళ్లద్దరి రేంజే మారిపోయింది ‘అర్జున్ రెడ్డి’తో. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు పెద్ద పెద్ద అవకాశాలు వచ్చాయి. అతనో స్టార్ అయిపోయాడు. క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడతను. మరోవైపు సందీప్ ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. అతడికి మహేష్ బాబు అవకాశం ఇవ్వబోతున్నాడని వార్తలొస్తున్నాయి.

విశేషం ఏంటంటే.. సందీప్-విజయ్ త్వరలోనే మళ్లీ కలవబోతున్నారట. ఓ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ విషయమై వీరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ డైరెక్ట్ మూవీనే చేయాలనుకున్నాడు. ‘సుగర్ ఫ్యాక్టరీ’ పేరుతో ఓ స్టోరీ కూడా రెడీ చేశాడు. కానీ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ చేయాల్సి రావడంతో దాన్ని పక్కన పెట్టాడు. మరి ఆ కథ మహేష్ కోసం రెడీ చేసిందా.. మరొకరికా అన్నది తెలియడం లేదు. ఒకవేళ మహేష్ సినిమానే ఓకే అయి.. వచ్చే ఏడాది సందీప్ ఆ చిత్రాన్ని మొదలుపెడితే.. అదవ్వగానే విజయ్ దేవరకొండతో ఓ ప్రాజెక్టు చేయాలనుకుంటున్నాడు. మహేష్ సినిమా ఓకే కాకపోతే దాని కంటే ముందే విజయ్ తో అతను జట్టు కడతాడు. ఇక విజయ్ కి ప్రస్తుతం చాలా కమిట్మెంట్లే ఉన్నాయి. ‘డియర్ కామ్రేడ్’.. ‘నోటా’లతో పాటు క్రాంతి మాధవ్.. నందిని రెడ్డిలతో సినిమాలు చేయాల్సి ఉంది. సందీప్ తో సినిమా ఓకే అయితే మాత్రం ‘డియర్ కామ్రేడ్’.. ‘నోటా’ల తర్వాత అతడితోనే పని చేయాలనుకుంటున్నాడతను.


Tags:    

Similar News