ఆఫ్రికన్ దేశానికి టూరిజం అంబాసిడర్ గా సంజయ్ దత్

Update: 2021-11-12 03:38 GMT
అనేక చట్టపరమైన కేసులు, ఆరోపణలు.. వివాదాలు ముసురుకున్నా కూడా కొంతమంది సెలబ్రిటీలపై ఆ క్రేజ్ నమ్మకం సడలవు. నమ్మశక్యం కాని రీతిలో వారికి గౌరవం దక్కుతుంది. వారికి అవార్డులు, రివార్డులు గుర్తింపును ఎవరూ ఆపలేరు. వారిలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒకరు. భారతదేశంలోనే అతిపెద్ద ముంబై బాంబు పేలుళ్ల కేసుల్లో జైలు జీవితం గడిపినప్పటికీ, సంజయ్ దత్ భారతదేశంలో అత్యంత బిజీగా ఉన్న నటులలో ఒకరు కావడం విశేషం. ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తున్నాడు.

తాజాగా సంజయ్ దత్ కు మరో అరుదైన గౌరవం లభించింది. ఈ బాలీవుడ్ బాబా ఇప్పుడు దేశ రాయబారిగా నియమితులయ్యారు. సంజయ్ దత్ ఇప్పుడు టాంజానియా దేశంలోని జాంజిబార్ సినీ రంగానికి పర్యాటక అంబాసిడర్‌గా నియామకమయ్యారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఆ దేశానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారు. ఆఫ్రికన్ దేశం టాంజానియా జాంజిబార్‌లో పెట్టుబడులు, ఆరోగ్యం -విద్యా రంగానికి సహకరించే అవకాశం లభించినందుకు నటుడు సంజయ్ దత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

సంజయ్ దత్ ఈ మేరకు ఒక ప్రకటన చేశాడు. 'మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది @dr.hmwinyi. జాంజిబార్‌లోని పెట్టుబడులు, ఆరోగ్యం & విద్యా రంగానికి సహకరించే అవకాశం లభించడంతోపాటు మీ ప్రభుత్వ సహకారంతో ఈ అందమైన ద్వీప నగరానికి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అంబాసిడర్‌గా ఉన్నందుకు నాకు గౌరవంగా ఉంది.’ అని సంజయ్ దత్ ట్విట్టర్ లో ఆనందం వ్యక్తం చేశారు.

సంజయ్ టాంజానియా ప్రధానమంత్రిని కలుసుకున్నారు. అతనితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు, అతను ఇలా రాసుకొచ్చాడు, 'గౌరవనీయమైన ప్రధాన మంత్రి @kassim_m_majaliwaని కలవడం నిజంగా గౌరవం! టాంజానియా చలనచిత్ర పరిశ్రమకు మద్దతు ఇవ్వగలిగినందుకు.. మీ అందమైన దేశం యొక్క పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టగలిగినందుకు నేను సంతోషిస్తున్నాను! త్వరలో మళ్లీ సందర్శిస్తానని ఆశిస్తున్నాను!’ అని పేర్కొన్నాడు.

సంజయ్ దత్ తన సూపర్ బిజీ ఫిల్మ్ షెడ్యూల్‌ల నుంచి టాంజానియా ఫిల్మ్ ఇండస్ట్రీ.. టూరిజం ప్రమోషన్ కోసం కొంత సమయం తీసుకోవలసి ఉన్నట్లు కనిపిస్తోంది.




Tags:    

Similar News