సంక్రాంతి సినిమాలు.. మొదటి వారం లో భారీ హంగామా!

Update: 2019-12-27 05:54 GMT
క్రిస్మస్  తోనే పండగ సీజన్ ప్రారంభం అయింది.. ఇక మూడు నాలుగురోజుల్లో డిసెంబర్ 31 వేడుకలు ఉంటాయి. అదేంటి న్యూ ఇయర్ డే కదా వేడుకలు అంటారా? ఎవరూ న్యూ ఇయర్ వేడుకలు చేసుకోరు.. డిసెంబర్ 31 నే వేడుకలు చేసుకుంటారు. న్యూ ఇయర్ డే నాడు అలసి పోయి పడుకుంటారు! ఇక సంక్రాంతి పండగ సీజన్ ఎలాగూ ఉన్నదే. ఆ హంగామా ఎలాగూ ఉంటుంది. అయితే ఈ మధ్యలో టాలీవుడ్ సినిమాల ఫంక్షన్లు.. ఈవెంట్ల హంగామా ఓ రేంజ్ లో ఉండబోతోంది.

సంక్రాంతి సీజన్లో మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 'దర్బార్'.. 'సరిలేరు నీకెవ్వరు'.. 'అల వైకుంఠపురములో'.. 'ఎంత మంచివాడవురా' సినిమాలు వరసగా ఒకటి రెండురోజుల గ్యాప్ లో విడుదల అవుతాయి. ఇప్పటికే ఈ సినిమాల ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్ల హంగామా జనవరి మొదటి వారం రెండో వారాల్లో జోరు గా ఉండబోతోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4 న జరపబోతున్నారు. దీంతో రచ్చ స్టార్ట్ అవుతుంది. జనవరి 5 వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్ బీ స్టేడియంలో భారీ స్థాయి లో జరిపేందుకు ప్లాన్ చేశారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్- ఎఆర్ మురుగదాస్ కాంబో 'దర్బార్' ప్రీ రిలీజ్ ఈవెంటును జవనరి 6 న లేదా 7 న చేసేందుకు ఆలోచిస్తున్నారట. మరో రెండు రోజుల్లో ఈ డేట్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ - సతీష్ వేగేశ్న కాంబినేషన్లో తెరకెక్కిన 'ఎంత మంచివాడవురా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 8 న జరుపుతున్నారు.

ప్రీ-రిలీజ్ కార్యక్రమాలే కాకుండా ట్రైలర్ రిలీజులు.. సాంగ్స్ రిలీజులు.. ఇంటర్వ్యూల హంగామా కూడా ఉంటుంది. దీంతో సంక్రాంతి సినిమా ప్రమోషన్ల హంగామా పీక్స్ కు చేరడం ఖాయం. ఈలెక్కన న్యూ ఇయర్లో ప్రేక్షకులు కూడా చాలా బిజీగా ఉండబోతున్నారని అనుకోవాలి.


Tags:    

Similar News