మెగాస్టార్ వదిలిన సత్యదేవ్ 'గాడ్సే' టీజర్..!

Update: 2021-12-20 08:11 GMT
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ''గాడ్సే''. గోపి గణేశ్ పట్టాభి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 'బ్లఫ్ మాస్టర్' తర్వాత వీరి కాంబోలో రూపొందిన సినిమా ఇది. సీకే స్ర్కీన్స్ బ్యానర్ పై నిర్మాత సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ - ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి టీజర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

''ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోనంత కాలం.. ప్రజలు మోసపోతూనే ఉంటారు'' అని సత్యదేవ్ చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. “మన డిగ్రీలు మనం ఆశించిన ఉద్యోగాలను ఇవ్వలేనప్పుడు మన జీవితానికి విలువ లేదు” అని ఐక్యరాజ్యసమితి మాజీ ఛైర్మన్ కోఫీ అన్నన్ కోట్ ని ప్రస్తావించడాన్ని బట్టి చూస్తే 'గాడ్సే' సినిమాలో నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపిస్తున్నట్లు అర్థం అవుతోంది.

అవినీతిమైన రాజకీయ నాయకులను అరికట్టాలనే లక్ష్యంతో ఫైట్ చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ముద్ర పడిన యువకుడు గాడ్సే గా సత్యదేవ్ కనిపించారు. అతన్ని పట్టుకోడానికి గాలిస్తున్న ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా.. అతని గతం తెలిసిన ప్రేయసిగా ఐశ్వర్య లక్ష్మి కనిపించింది. 'జగమే తంత్రం' తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఐశ్వర్య లక్ష్మీ నటించిన తొలి తెలుగు సినిమా ఇది.

''సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి.. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి.., వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి.. కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయిరా? ఎందుకంటే మీరంతా సర్వీస్ పేరుతో పబ్లిక్ మనీ లూటీ చేస్తున్నారు'' అని టీజర్ లో సత్యదేవ్ ఒంటికి టైమ్ బాంబ్ కట్టుకొని ఆవేశంగా ప్రశ్నించడం ఆలోచింపజేస్తుంది. అంతేకాదు 'గాడ్సే' రాజకీయ నాయకులను - రాజకీయ వ్యవస్థను టార్గెట్ చేసే పొలిటికల్ డ్రామాని సూచిస్తుంది.

'బ్లఫ్ మాస్టర్' తర్వాత సత్యదేవ్ - గోపి గణేష్ కలిసి మరో హార్డ్ హిట్టింగ్ కంటెంట్ తో వస్తున్నారని ''గాడ్సే'' టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ కు సునీల్ కశ్యప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉత్కంఠత రేకెత్తిస్తోంది. సురేష్ ఎస్ సినిమాటోగ్రఫీ.. సాగర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

'గాడ్సే' చిత్రంలో నాజర్ - సాయాజీ షిండే - కిషోర్ - ఆదిత్య మీనన్ - బ్రహ్మాజీ - నాగబాబు - పృథ్వీరాజ్ - తనికెళ్ళ భరణి - ప్రియదర్శి - చైతన్య కృష్ణ - గురు చరణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.






Full View
Tags:    

Similar News