టాలెంటెడ్‌ డైరెక్టర్‌.. పత్తా లేడు!

Update: 2015-07-01 13:30 GMT
ఆనంద్‌, గోదావరి, హ్యాపీడేస్‌.. ఈ సినిమాల్ని గుర్తు చేసుకుంటే ఏ సినీ అభిమానికైనా మనసు పులకరించక మానదు. సెన్సిబుల్‌ సినిమాలతో టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండు సృష్టించాడు శేఖర్‌ కమ్ముల. ఐతే అతను తీసిన తొలి రెండు సినిమాలకు ప్రశంసలు వచ్చిన స్థాయిలో డబ్బులు రాలేదు. కానీ హ్యాపీడేస్‌ మాత్రం భారీగా కలెక్షన్లు కూడా రాబట్టి.. శేఖర్‌ను కమర్షియల్‌ డైరెక్టర్‌గానూ నిలబెట్టింది. కానీ తర్వాతి మూడు సినిమాలు కమ్ములను కింద పడేశాయి. ముఖ్యంగా 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాతో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు శేఖర్‌.

అప్పటికి జరిగిన నష్టం చాలదని.. మొహమాటానికి పోయి 'కహానీ'ని 'అనామిక'గా తెలుగులోకి రీమేక్‌ చేసి మరింత చెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా వచ్చింది తెలీదు పోయింది తెలీదు. అనామిక రిలీజై ఏడాది దాటుతోంది. ఇప్పటిదాకా కమ్ముల తర్వాతి సినిమా ఏంటన్నదే తెలియట్లేదు. 'హ్యాపీడేస్‌'ను హిందీలోకి రీమేక్‌ చేస్తానన్నాడు. ఆ పనిలో ఏమైనా ఉన్నాడో ఏంటో గానీ.. కమ్ముల గురించి ఏ అప్‌డేట్స్‌ లేవు. ఒకవేళ ఆ రీమేక్‌ ప్రయత్నాల్లోనే ఉంటే మాత్రం కమ్ముల మరో తప్పు చేస్తున్నట్లే. ఇప్పుడతను ముందుగా టాలీవుడ్‌లో తనేంటో మళ్లీ రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. తన ఎఫర్ట్స్‌ మొత్తం పెట్టి మళ్లీ ఓ మంచి సినిమా తీస్తాడనుకుంటే.. ఎవరికీ దొరక్కుండా పోయాడు. మళ్లీ కమ్ముల మార్కు సినిమా ఎప్పుడు చూస్తామో ఏంటో!

Tags:    

Similar News