చెన్నై కోసం సూపర్ స్టార్ కోటి సాయం

Update: 2015-12-07 14:14 GMT
చెన్నైకి వచ్చిన కష్టం అందరినీ కదిలిస్తోంది. మొదట కోలీవుడ్ తారలు చెన్నై రోడ్లపైకి వచ్చి సాయం చేస్తూ.. రియల్ హీరోలు అనిపించుకున్నారు. తర్వాత టాలీవుడ్ నటులు చెన్నైకు విరాళాలు ప్రకటించడం ప్రారంభించారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి అవసరమైన సామాగ్రి పంపేందుకు నడుం బిగించారు.

మన మద్రాస్ కోసం అంటూ తెలుగు స్టార్లు ఇప్పుడు  కేంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు చెన్నైకి సాయం చేసేందుకు.. చెన్నై ఎక్స్ ప్రెస్ హీరో షారూక్ ఖాన్ కూడా ముందుకొచ్చాడు. ఇప్పటివరకూ అందరూ ప్రకటించిన విరాళాల కంటే అతి ఎక్కువగా.. ఏకంగా కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా. తన ప్రొడక్షన్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టెయిన్ మెంట్ తరఫున ఈ విరాళం ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ అధికారిక లేఖ ద్వారా వెల్లడించి, ఆ లెటర్ ను ఆన్ లైన్ లో పోస్ట్ చేశాడు. ఒకవైపు తమిళనాడులో తిరుగులేని ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ కేవలం 5 లక్షల  రూపాయల విరాళంతో సరిపెట్టుకుంటే.. బాలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం ఏకంగా కోటి రూపాయలు ఇస్తుండడం విశేషం.

ఇప్పటికే చెన్నై బాధితులకి సాయం చేసేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 25 లక్షలు, టాలీవుడ్ సూపర్ స్టార్ 10 లక్షలు ప్రకటించారు. మరి కొందరు విశేషంగా సాయం చేస్తున్నారు. అగరం ఫౌండేషన్‌ ద్వారా సూర్య, ఇతర ఫౌండేషన్ల ద్వారా ధనుష్‌ గ్రౌండ్‌ లెవెల్‌ లో సాయం అందిస్తున్నారు. అందరికంటే మిన్నగా సిద్దార్ధ్ - లారెన్స్‌ లు భారీగా సహాయ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News