8 వారాలు అన్నారు కానీ 2 వారాల్లోనే ఓటీటీలో!

Update: 2022-09-29 14:30 GMT
అందాల రెజీనా.. నివేద థామ‌స్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించిన `శాకిని డాకిని` బాక్సాఫీస్ వసూళ్ల పరంగా డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు ఆక‌ర్షించడంలో త‌డ‌బ‌డిన సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద‌ చివ‌రికి డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 14 రోజుల తర్వాత  OTTలో వ‌చ్చేస్తోంది. ఇది సెప్టెంబర్ 30 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. శాకిని డాకిని సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదలై సరిగ్గా రెండు వారాల తర్వాత డిజిట‌ల్ లోకి వ‌చ్చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

దీనివ‌ల్ల థియేట‌ర్ల‌కు వెళ్లే వాళ్ల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతుంది. థియేట్రికల్ విడుదల తేదీ తర్వాత కేవలం 2 వారాల్లోనే డిజిట‌ల్లోకి వచ్చేస్తే థియేటర్లలో సినిమాను విడుదల చేయడం వ‌ల్ల‌ ప్రయోజనం ఏమిటని ఒక సెక్ష‌న్ ప్ర‌శ్నిస్తోంది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఇది కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ మిడ్ నైట్ రన్నర్స్ కి రీమేక్. ఈ చిత్రాన్ని మొదట నిర్మాత సురేష్ బాబు డైరెక్ట్ టు OTT విడుదలకు ప్లాన్ చేసారు. కానీ కొన్ని కారణాల వల్ల తరువాత థియేటర్లలోకి వచ్చింది. రెండు వారాల్లోనే ఇది OTTలో వ‌చ్చేస్తోంది.

ఓటీటీ కొత్త‌ రూల్ ఏమైన‌ట్టు?

ఫిలింఛాంబ‌ర్ ప‌రిధిలో నిర్మాతలు పంపిణీదారులు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన థర్డ్ పార్టీలతో విస్తృతమైన చర్చలు జ‌రిపాక స‌రికొత్త సూచ‌న‌లు నిర్ణ‌యాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. ప్రతి సినిమాకు ఎనిమిది (8) వారాల‌ థియేట్రికల్ విండో తప్పనిసరి. ఆ త‌ర్వాతే ఓటీటీలో విడుద‌ల చేయాలి.

థియేటర్లలో ఏదైనా సినిమా ప్రారంభమయ్యే ముందు OTT లేదా శాటిలైట్ భాగస్వామి పేర్లను పేర్కొనకూడదు. స్ట్రీమింగ్ భాగస్వామి పేరు కూడా సినిమా ప్రచార సామాగ్రిలో ఎక్కడా కనిపించకూడదు. OTT పేరు ఏదైనా పోస్టర్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ లో కనిపించిన వెంటనే కొంతమంది ప్రేక్షకులు థియేటర్ ల‌కు వ‌చ్చే బదులు స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లో తర్వాత చూడటానికి తమ మనస్సును ప్రిపేర్ చేస్తున్నారు.

అందుకే ఈ కొత్త నియమం అంద‌రినీ ప్ర‌భావితం చేస్తుంది. ఓటీటీ కోసం ఎదురు చూడ‌కుండా చేస్తుంద‌ని భావించారు. ఓటీటీ భ్ర‌మ‌ల్ని తొల‌గించ‌గ‌లిగితే థియేటర్లలో మాత్రమే సినిమాలను చూసేలా చేస్తుందని కూడా భావించారు. అయితే 8 వారాల ముందు స్ట్రీమింగ్ కి అనుమ‌తి లేన‌ప్పుడు ఇప్పుడు ఈ సినిమాని ఎలా ఓటీటీకి అనుమ‌తించారు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. శాకిని డాకిని రెండు వారాల్లోనే ఓటీటీల్లోకి వ‌చ్చేస్తోంది.. ఇదెలా సాధ్యం?  అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News