ఇండస్ట్రీ వల్లే ఉదయ్ కిరణ్ అలా..: శివాజీ రాజా

Update: 2017-06-28 11:15 GMT
గత కొన్నేళ్లలో సినీ ప్రముఖులు చాలామంది కాలం చేశారు. ఐతే అన్నింట్లోకి ఉదయ్ కిరణ్ మరణమే అతి పెద్ద విషాదం. ఒక సమయంలో కోట్లాదిమందిని మెప్పించి పెద్ద స్టార్ అయ్యేలా కనిపించిన ఈ నటుడు.. తర్వాత తీవ్ర మనోవేదనకు లోనై బలవన్మరణానికి పాల్పడటం అందరినీ తీవ్రంగా కలచివేసింది. ఉదయ్ మరణంపై చాలామంది సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ఉదయ్ ఆత్మహత్యపై స్పందించాడు. అతనలా బలవన్మరణానికి పాల్పడటానికి సినీ పరిశ్రమే కారణమంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కిరణ్ పేరిట నిర్వహిస్తున్న షార్ట్ ఫిలిం పురస్కారాల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన శివాజీ రాజా ఉద్వేగానికి గురయ్యాడు. ఆ సందర్భంగా ఆయనేమన్నారంటే..

‘‘ఉదయ్ కిరణ్ ప్రతిభావంతుడైన నటుడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కింది స్థాయి నుంచి తన కష్టంతో పైకి వచ్చాడు. అలాంటి నటుడు అర్ధాంతరంగా జీవితం చాలించడం చాలా దురదృష్టకరం. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం సినీ పరిశ్రమయే. బాధలో ఉన్నవారిని ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. కష్టాల్లో ఉన్న అతడిని ఇండస్ట్రీ ఆదుకొని ఉంటే అతనీ రోజు మన మధ్యన ఉండేవాడు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిన దుస్థితి రాకపోయి ఉండేది. పరిశ్రమలో చాలా మంది స్వార్ధపరులున్నారు. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్లదే. పక్కవాడిని పట్టించుకోరు’’ అని శివాజీ రాజా అన్నాడు. ఉదయ్ కిరణ్ తనతో పాటు శ్రీకాంత్.. తరుణ్.. ఇలా చాలామందికి సన్నిహితుడని.. అతడి పేరిట అవార్డుల వేడుకను భారీ స్థాయిలో నిర్వహించడం సంతోషమని.. ఇదంతా చూస్తుంటే ఉదయ్ కిరణ్ బతికే ఉన్నాడనిపిస్తోందని శివాజీ రాజా వ్యాఖ్యానించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News