ఒకే రోజు తండ్రీ కూతుళ్ల సినిమాలు

Update: 2015-04-14 13:08 GMT
అన్నదమ్ముల సవాల్‌ గురించి విన్నాం కానీ.. తండ్రీ కూతుళ్ల సవాల్‌ ఇప్పుడే చూడబోతున్నాం. తండ్రి హీరోగా, కూతురు హీరోయిన్‌గా నటించిన వేర్వేరు సినిమాలు ఒకే రోజు విడుదలై పోటీకి నిలవబోతున్నాయి. ఆ తండ్రీ కూతుళ్లు మరెవరో కాదు.. కమల్‌ హాసన్‌, శ్రుతి హాసన్‌. కమల్‌ హాసన్‌ కొత్త సినిమా ఉత్తమ విలన్‌, శ్రుతి నటించిన బాలీవుడ్‌ మూవీ 'గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌' మే 1న విడుదల కాబోతున్నాయి. శ్రుతి సినిమా మే 1ని లాక్‌ చేసుకుని చాలా కాలమైంది. ఐతే ఉత్తమ విలన్‌ ముందుగా అనుకున్న ప్రకారమైతే ఈపాటికే ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చి మే 1కి ఫిక్సయింది.

ఉత్తమ విలన్‌కు సంబంధించి అన్ని వివాదాలూ క్లియరైపోవడంతో మే 1న విడుదల కావడం ఖాయమనే చెప్పాలి. ఐతే తండ్రీ కూతుళ్ల సినిమాలు ఒకదానికి ఒకటి పోటీ అని భావించలేం. ఎందుకంటే ఉత్తమ విలన్‌ హిందీలో విడుదల కావట్లేదు. ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్స్‌ మాత్రమే రిలీజ్‌ చేస్తున్నాడు కమల్‌. ఇక 'గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌'కు దక్షిణాదిన పెద్దగా క్రేజ్‌ లేదు. ఆ సినిమా రమణగా తమిళంలో, ఠాగూర్‌గా తెలుగులో దశాబ్దం కిందట విడుదలై ఘనవిజయం సాధించింది. కాబట్టి తండ్రీ కూతుళ్లది అసలు సిసలైన పోటీ అని చెప్పడానికేం లేదు.
Tags:    

Similar News