నేషనల్ మీడియాపై మండిపడుతున్న సిద్ధార్థ్

Update: 2015-11-25 09:30 GMT
ఈ సమస్య కొత్తదేమీ కాదు. ఎప్పట్నుంచో ఉన్నదే. నార్త్ ఇండియాలో ఓ మనిషి చనిపోయినా నేషనల్ మీడియాకు పెద్ద న్యూస్ అయి కూర్చుంటుంది. కానీ సౌత్ ఇండియాలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినా వాళ్లకు పట్టదు. ఈ పార్షియాలిటీ మీదే మండి పడుతున్నాడు తమిళ హీరో సిద్దార్థ్.

రెండు వారాలుగా తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలం అయిపోతోంది. వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుని ఉన్నాయి. చెన్నై లాంటి పెద్ద నగరంలోనే చాలా ఏరియాలో మునిగిపోయి ఉన్నాయి. కానీ ఈ వార్తలు నేషనల్ మీడియాలో పెద్దగా హైలైట్ కావట్లేదు. రోజులో ఒక్కసారి కూడా ఈ వార్త ప్రసారం కావడం గగనంగా ఉంది. ఐతే ముంబయిలో ఎప్పుడైనా భారీ వర్షాలు పడ్డాయంటే చాలు.. రోజంతా ఆ వార్తలే కనిపిస్తాయి నేషనల్ మీడియాలో.

ఇదేం వివక్ష అని ప్రశ్నిస్తున్నాడు సిద్ధార్థ్. తమిళనాడు దారుణమైన పరిస్థితుల్లో ఉందని.. నేషనల్ మీడియా ఇక్కడి పరిస్థితి దేశానికి తెలియజేసి సాయం అందేలా చూడాలని అతను నాలుగైదు రోజుల నుంచి ట్విట్టర్ లో కోరుతున్నాడు. ప్రాణాలు పోతున్నాయని.. పట్టించుకోండని అంటున్నాడు. కానీ నేషనల్ మీడియా తమిళనాడు వైపు చూడట్లేదు. సెన్సార్ బోర్డు గురించి, అమీర్ వ్యాఖ్యల గురించి విపరీతమైన కవరేజీ ఇస్తున్న నేషనల్ మీడియా.. తమిళనాడును మాత్రం పట్టించుకోకపోవడం విచారకర విషయమే కదా.
Tags:    

Similar News