మాస్ రాజాతో టిల్లు వ‌ర్కవుట్ అయ్యేనా?

Update: 2022-11-13 09:30 GMT
రీమేక్ సినిమాల‌కు కాలం చెల్లిన రోజులివి. రీసెంట్ గా విడుద‌లైన‌ రీమేక్ సినిమాలు ఎలాంటి ఫ‌లితాల‌ని సొంతం చేసుకున్నాయో అంద‌రికి తెలిసిందే. స్టార్ లు క‌లిసి న‌టించినా స‌రే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌ల‌కు రావ‌డానికి ఆస‌క్తిని చూపించ‌లేదంటే రీమేక్ ల‌పై ప్రేక్ష‌కులు ఎంత‌గా చిరాకుతో వున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. పైగా ఓటీటీలు, డిజిల్ మీడియా ప్ర‌భావం బాగా పెరిగిపోవ‌డంతో త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ సినిమాల‌ని కూడా తెలుగులో అనుదించేస్తున్నారు.

దీంతో ప్ర‌తీ సినిమా ప్రేక్ష‌కుడికి తెలిసి పోతోంది. దీంతో రీమేక్ లుచేయ‌లేని ప‌రిస్థితులు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే తెలిసిన క‌థ‌ల‌ని మ‌ళ్లీ రీమేక్ చేసి థియేట‌ర్ల‌కు ర‌మ్మంటే ప‌రిస్థితి ఎలా వుంటుందో `గాడ్ ఫాద‌ర్‌` జ‌స్ట్ ఎగ్జాంపుల్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌ల‌యాళ మూవీ `లూసీఫ‌ర్‌` ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. అప్ప‌టికే ఈ సినిమా తెలుగులో డ‌బ్ అయిపోయింది. ఓటీటీల్లోనూ, యూట్యూబ్ లోనూ వ‌చ్చేసింది.

అలాంటి తెలిసిన క‌థ‌ని మ‌ళ్లీ రీమేక్ చేసి థియేట‌ర్ల‌కు వ‌చ్చి చూసేయండి అంటూ జ‌నం చూస్తారా?.. చూడ‌రు.. `లూసీఫ‌ర్` రీమేక్ `గాడ్ ఫాద‌ర్` ని జ‌నం అందుకే పెద్ద‌గా చూడ‌లేదు. చిరు, స‌ల్మాన్ ఖాన్‌, న‌య‌న‌తార క‌లిసి న‌టించార‌ని చెప్పినా పెద్ద‌గా లాభం లేక‌పోయింది. రీమేక్ సినిమాల‌కు కాలం చెల్లిన వేళ విచిత్ర‌మైన కాంబినేష‌న్ లో `మానాడు` రీమేక్ కు రెడీ అవుతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మిళంలో శింబు హీరోగా వెంక‌ట్ ప్ర‌భు రూపొందిన మూవీ ఇది.

దీన్ని తెలుగులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ రీమేక్ చేయ‌బోతోంది. ఇందు కోసం మాస్ రాజా ర‌వితేజ‌, డీజే టిల్లు ఫేమ్ సిద్దూ జొన్న‌గ‌డ్డ‌ని ఎంచుకున్న‌ట్టుగా చెబుతున్నారు. ఇక ఈ రీమేక్ కు ద‌శ‌ర‌థ్ డైరెక్ట్ చేయ‌బోతుండ‌టం మ‌రింత క‌ల‌వ‌రాన్ని క‌లిగిస్తోంది. `మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్‌` త‌రువాత హిట్ అనే మాట ఎరుగ‌ని ద‌శ‌ర‌థ్ మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఈ రీమేక్ ని డైరెక్ట్ చేయ‌బోతుండ‌టం గ‌మ‌నార్హం.

శింబు పాత్ర‌లో ర‌వితేజ‌, విల‌న్ గా న‌టించిన ఎస్‌.జె. సూర్య పాత్ర‌లో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ న‌టించ‌నున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఇప్ప‌టికే `బుట్ట‌బొమ్మ‌` లో విల‌న్ పాత్ర చేయ‌న‌ని త‌ప్పుకుని `టిల్లు స్క్వేర్‌`లో న‌టిస్తున్న సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ `మానాడు` రీమేక్ లో విల‌న్ క్యారెక్ట‌ర్ చేస్తాడ‌న‌డం క‌లే అవుతుంది. ఇలాంటి విచిత్ర‌మైన క‌ల‌యిక‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డ‌మే క‌ష్టం అని నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News