అక్షర వైద్యుడుగా.. ఆరాధ్యుడిగా...

Update: 2021-11-30 14:34 GMT
ఆయన్ని డాక్టర్ గా చూడాలన్నది  తండ్రి ఆశయం. ఆయన కూడా  ప్రతిభావంతుడైన విద్యార్ధి. అయితేనేమి తనకు నచ్చిన సాహితీ రంగాన్ని ఎన్నుకుని సినీ కవిగా మారి అక్షర వైద్యం చేశారు. ఎన్నో మనసులకు తగిన గాయాలను అలా తుడిచివేశారు. ఆయనే సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన ఇంటిపేరు చేంబోలు. ఆయనది విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతం. విశాఖలోనే ఉన్నత విద్యాభ్యాసం చేసిన సీతారామశాస్త్రి బాల్యం నుంచే కవితలు అల్లడం మొదలెట్టారు. అప్పట్లోనే ఆయన కవిత్వానికి ముగ్దులు కాని వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు.

ఇలా విశాఖ జిల్లాలో తన కవితా ప్రస్థానాన్ని సాగిస్తూ వచ్చిన సీతారామశాస్త్రి కళా తపస్వి విశ్వనాధ్ దృష్టిలో పడడంతో ఆయన దశ తిరిగింది. మొదటి పాట బాలక్రిష్ణ నటించిన జననీ జన్మభూమిలో గంగావతరణం అయినా సిరివెన్నెలలో మొత్తం పాటలు రాసి తెలుగు సినీ రంగాన్ని సాహితీ పరిపుష్టం చేశారు. ఇటు క్లాస్ అటు మాస్ ఏ పాట అయినా శాస్త్రి గారి రూటే సెపరేట్ అన్నట్లుగా వీర విహారమే చేశారు.

ఎన‌భై దశకంలో ఇండస్ట్రీలో ప్రవేశించిన ఆయన ఆ రెండు దశాబ్దాలు నావీ అని కడు ధీమాగా ప్రకటించి మరీ సింగిల్ కార్డు తో రాసిన సినిమాలు ఎన్నో. ఒక వైపు  మెగాస్టార్ చిరంజీవి సినిమాకు రాస్తూనే కళా తపస్వి విశ్వనాధ్ చిత్రానికి పాటలను అద్దేవారు. పక్కా మాస్ బీట్లకు అక్షరాలను పొందికగా చేరుస్తూనే అందమైన సరిగమలకు పద మధురిమలు సమకూర్చేవారు.

సీతారామశాస్త్రి ఒక టైమ్ లో గీత రచయితగా టాలీవుడ్ ని  శాసించారు. ఆయన రాయడానికి టైమ్  లేకపోయినా రాయించేందుకు పోటీ పడిన దర్శకులు, నిర్మాతలు ఎందరో ఉండేవారు. ఇక హీరోలకు కూడా బహు ఇష్టుడు ఆయన. ఆయన పాట ఎంత మధురమో మాట కూడా అంతే తీయనిది. ఆయన ప్రసంగాలు వినేవారికి అద్భుతమైన భావన కలిగేది అంటే అతిశయోక్తి కాదు. సీతారామశాస్త్రి ఒక సందర్భంలో చెప్పిన మాట ఏంటి అంటే తనకు పాటలు రాసే అవకాశాలు తగ్గలేదని, తానే పాటలను ఎన్నుకుంటూ నచ్చినవి రాస్తున్నానని. అలా తనకు నచ్చకపోతే తాను రాయగలిగే విధంగా సన్నివేశం లేకపోతే ఆయన నో అని  చెప్పేసేవారు. ఏది ఏమైనా తొలి తరం కవులకు, నవతరం రచయితలకు ఆయన వారధి, అంతే కాదు, కవితా సారధి కూడా.
Tags:    

Similar News