ఏపీ థియేటర్లు.. మొదటికే మోసమొచ్చింది!

Update: 2021-12-16 16:30 GMT
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రగడ ఎంతకీ తెగట్లేదు. ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులివ్వడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హమ్మయ్య అనుకున్నారు. 'పుష్ప' లాంటి భారీ చిత్రం విడుదలకు ముందు ఇది గొప్ప ఊరటే అని భావించారు. ఏప్రిల్ ముందు ఉన్న పాత రేట్లతో టికెట్లు అమ్మి ఆదాయం పెంచుకోవచ్చని ఆశించారు. కానీ ఏపీ సర్కారు ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలితేనా? కోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లాలని భావించింది. ఈ లోపు ఎక్కడ పాత రేట్లతో అమ్మేస్తారో అని.. తాము నిర్దేశించిన ప్రకారమే టికెట్ల రేట్లు ఉండాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంలో థియేటర్లపై నిఘా పెట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్లాయి. ఐతే ఏపీ ప్రభుత్వ అప్పీల్ మీద గురువారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఈ విషయంలో ఎటూ తేల్చలేదు. ప్రస్తుతానికి టికెట్ల ధరలపై నిర్ణయం జాయింట్ కలెక్టర్లకు వదిలేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇప్పుడు ఏపీలో థియేటర్ల పరిస్థితేంటో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. 'పుష్ప' సినిమాకు ఏ రేట్లతో టికెట్లు అమ్మాలో తెలియని అయోమయంలో పడిపోయారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారం అమ్మి ఆదాయం కోల్పోవడం ఎందుకని, పాత రేట్లే ఉండాలన్న కోర్టు ఆదేశాలు అమలవుతాయేమో అని వేచి చూసే ధోరణిలో ఏపీలో చాలా వరకు థియేటర్ల యజమానులు ఉన్నారు. ఈ విషయంలో స్పష్టత కోసమని ఏపీలో చాలా సిటీల్లో 'పుష్ఫ' బుకింగ్సే ఓపెన్ చేయలేదు. తిరుపతి, రాజమండ్రి సహా చాలా నగరాలు, పట్టణాల్లో విడుదలకు ముందు రోజు కూడా 'పుష్ప' బుకింగ్స్ పెట్టలేదు. దీంతో ఇప్పుడు మొదటికే మోసం వచ్చే పరిస్థితి తలెత్తింది. పాత రేట్ల అమలుపై ఆశా లేదు. ఇప్పటిదాకా బుకింగ్సే ఓపెన్ చేయకపోవడం వల్ల కచ్చితంగా తొలి రోజు వసూళ్లపై ప్రభావం పడేలా ఉంది. ఈ గందరగోళ పరిస్థితి పట్ల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటున్నారు. మరి శుక్రవారం 'పుష్ఫ' ఎలాంటి అనుభవం మిగులుస్తుందో చూడాలి.
Tags:    

Similar News