అభిమానులే టాలీవుడ్ ని కిల్ చేస్తున్నారా?

Update: 2022-05-13 10:31 GMT
టాలీవుడ్ దాదాపు రెండేళ్లుగా క‌రోనా కార‌ణంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. భారీ సినిమాల రిలీజ్ లు లేవు. థియేట‌ర్ల వ‌ద్ద ఫ్యాన్స్ సంద‌డి లేకుండా చాలా సప్ప‌గా సాగింది. సాధార‌ణ ప‌రిస్థితులు ప్రారంభం కావ‌డంతో టాలీవుడ్ లో సినిమాల సంద‌డి మొద‌లైంది. దాదాపు రెండేళ్లుగా రిలీజ్ కు నోచుకోని సినిమాల‌న్నీ బ్యాక్ టు బ్యాక్ థియేట‌ర్ల‌లో హంగామా చేస్తుండ‌టంతో ఫ్యాన్స్ ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది. న‌చ్చిన హీరో సినిమా థియేట‌ర్లలోకి వ‌చ్చేస్తోందంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. దీంతో సినిమా థియేట‌ర్ల వ‌ద్ద జాత‌ర వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం మొద‌లైంది.  

ఒక సొనొమి విడుద‌ల‌వుతోందంటే సాధార‌ణ ప‌బ్లిసిటీ కంటే ఇప్ప‌డు సోష‌ల్ మీడియా ప్ర‌చారం ప్ర‌ధానంగా మారింది. దీంతో ఫ్యాన్స్ ఫ‌స్ట్ లుక్ నుంచి సినిమా ఫ‌స్ట్ షో స్క్రీన్ షాట్స్ వ‌ర‌కు త‌మ అభిమాన హీరో సినిమాని నెట్టింట వైర‌ల్ చేస్తూ ప్ర‌చారం చేయ‌డం మొద‌లైంది. ఇక్క‌డే అస‌లు చిక్కు వ‌చ్చిప‌డుతోంది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే చాలా అభిమానులు ఓ రేంజ్ లో నెట్టింట హ‌ల్ చేస్తుంటే మ‌రో ప‌క్క యాంటీ ఫ్యాన్స్ మ‌రో త‌ర‌హాలో ప్ర‌చారం చేస్తుండ‌టం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది.

సోష‌ల్ మీడియా వాడ‌కం మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి దీని ప్ర‌భావం భారీగా పెర‌గ‌డం, ప్ర‌తీ స్టార్ హీరో సినిమాకిది కీల‌కంగా మార‌డంతో దీన్నే ప్ర‌ధాన అస్త్రంగా వాడుకుంటూ ఫ్యాన్స్ త‌మ హీరో సినిమాని ప్ర‌మోట్ చేస్తుంటే యాంటీ హీరో ఫ్యాన్స్ మాత్రం ఇదే సోష‌ల్ మీడియాని అడ్డుపెట్టుకుని నెగెటివ్ ప్ర‌చారం చేస్తూ సినిమాని కిల్ చేయ‌డం ప‌నిగా పెట్టుకున్నారు. ఇటీవ‌ల ఫ్యాన్స్ వార్ సోష‌ల్ మీడియాలో తారా స్థాయికి చేరింది. 'ట్రిపుల్ ఆర్', ఆచార్య సినిమా రిలీజ్ టైమ్ లో ఇది చాలా వ‌ర‌కు క‌నిపించింది. 'ట్రిపుల్ ఆర్' లో త‌మ హీరోని త‌క్కువ చేసి చూపించారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మెగా ఫ్యాన్స్ కు మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డిచింది.

ఆ త‌రువాత అదే 'ఆచార్య‌' ని డిజాస్ట‌ర్ బాట‌ప‌ట్టించింది. ట్రిపుల్ ఆర్ పై వున్న అక్క‌సుతో యాంటీ ఫ్యాన్స్ గా మారిన వారంతా మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన 'ఆచార్య‌'ని సోష‌ల్ మీడియా వేదిక‌గా దారుణంగా కిల్ చేశారు. చిరు గ్రాఫిక్స్ షాట్ కు సంబంధించిన పిక్ ని షేర్ చేస్తూ గ్రాఫిక్స్ నాణ్య‌త‌ని, సినిమా తీసిన విధానాన్నిటార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. ఇన్నేళ్ల కెరీర్ లో చిరు సినిమాని క్రిటిక్స్ కూడా విమ‌ర్శించ‌ని స్థాయిలో యాంటీ ఫ్యాన్స్ విమ‌ర్శిస్తూ నెట్టింట ట్రోల్ చేయ‌డం పలువురు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది.

గ‌తంలో ఏదైనా సినిమా ఫ్లాప్ అయినా స‌రే ఆ ప్ర‌భావం పెద్ద‌గా క‌లెక్ష‌న్ ల‌పై ప‌డేది కాదు. కానీ ఇప్ప‌డు మాత్రం క‌నీసం పెట్టిన పెట్టుబ‌డిలో స‌గం కూడా రాకుండా సోష‌ల్ మీడియాని అడ్డుపెట్టుకుని యాంటీ ఫ్యాన్స్ సినిమాని కిల్ చేస్తున్నారు. దీంతో భారీ రేట్లు పెట్టికొన్న బ‌య్య‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు అయ్యా మా ప‌రిస్థితి ఏంట‌ని స్టార్ ల‌కే స్వ‌యంగా లెట‌ర్ లు రాసే దుస్థితికి చేరింది. ఈ ప‌రిస్థితికి ప్ర‌ధాన కార‌కులు యాంటీ ఫ్యాన్స్. ఒక హీరోపై వున్న ప్రేమ‌ని మ‌రో హీరోపై ద్వేషంగా మారుస్తూ స‌ద‌రు హీరో సినిమా రిలీజైందంటే దాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కిల్ చేస్తున్నారు.

ఇందుకు తాజాగా విడుద‌లైన 'స‌ర్కారు వారి పాట' ని ఉద్దేశించి సోష‌ల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రెండ్ చేసిన #DisasterSVP అనే హాష్ ట్యాగ్ ఉదాహ‌ర‌ణ‌. అభిమానులే ఇలా అభిమానం ముసుగులో టాలీవుడ్ ని చంపేయ‌డానికి కంక‌ణం క‌ట్టుకోవ‌డం విచార‌క‌రం. ''చెట్టుకొమ్మ‌ని న‌ర‌కాల‌ని ఒక‌డు రంపం ప‌ట్టుకుని త‌ను కూర్చున్న కొమ్మ‌నే అత్యుత్సాహంతో న‌రికేసిన‌ట్టు'' గా వుంది అభిమానులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు. అభిమానం ముసుగుతో త‌మ హీరోని పాపుల‌ర్ చేయాలని ఇత‌ర హీరోల‌తో ద్వేషాన్ని చిమ్ముతూ టాలీవుడ్ మ‌నుగ‌డ‌కే భ‌స్మాసురులుగా మారుతున్నారు. అభిమానం అంటూనే అదే ముసుగులో తెలియ‌కుండానే ఇండ‌స్ట్రీని కిల్ చేస్తున్నారు.  

వారి దురాభిమానం కార‌ణంగా ఒక్క స్టార్ సినిమా బ‌ల‌వంతంగా డిజాస్టర్ గా ముద్ర‌ప‌డితే ఎన్ని వంద‌ల కుటుంబాలు రోడ్డున ప‌డ‌తాయో క‌నీసం అవ‌గాహ‌న లేని అభిమానులు పునరాలోచించుకుంటే మంచిది. అభిమానం పేరుతో ఎంత మంది జీవితాల్ని నాశ‌నం చేస్తున్నామో అర్థం చేసుకుంటే మంచిది. స్టార్ హీరో  కెరీర్‌ని, బ‌య్య‌ర్ల జీవితాల్ని, శ్రామికుల కుటుంబాల్ని వారి పైశాచిక ఆనందం కోసం బ‌జారున ప‌డేస్తున్న దురాభిమానులు ఒక్కసారి ఏం చేస్తున్నామో త‌మ‌ని తాము ప్ర‌శ్నించుకుంటే మంచిది. ఇదే ఆలోచ‌న‌తో సినిమాల‌పై నెటివిటీని ప్ర‌చారం చేస్తే స్టార్స్ సినిమాల మాటేమో గానీ టాలీవుడ్ ఉనికే ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం వుంది. అభిమానులూ త‌స్మాత్ జాగ్ర‌త్త‌
Tags:    

Similar News