ఇంటర్యూ: నా జీవితంలో నైస్‌ పర్సనాలిటీ

Update: 2015-07-14 14:22 GMT
అప్పుడెప్పుడో 2008లో రెయిన్‌బో సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది సోనాల్‌చౌహాన్‌. కానీ అనూహ్య పరాజయం చిక్కుల్ని కొనితెచ్చిపెట్టింది. తొలిసినిమానే పరాజయం పాలయ్యాక ఇక ఈ అమ్మడికి అవకాశాలిచ్చేదెలా అందుకే టాలీవుడ్‌ పక్కనబెట్టేసింది. కాని ఇప్పుడు 2015లో బిజీ స్టార్‌ అయిపోయింది. ఓ లుక్కేద్దాం పదండి.

పట్టువదలని విక్రమార్కుని సోదరిలా బాలీవుడ్‌లో అప్పట్లో అవకాశాల వేట మొదలెట్టింది. అక్కడ ఇమ్రాన్‌హస్మి సరసన ఓ సినిమాలో నటించింది. ఆ చిత్రంలో బెడ్‌రూమ్‌ సన్నివేశాల్లో ముద్దులవీరుడితో జీవించింది. ఆ తర్వాత అనూహ్యంగా 'లెజెండ్‌' కాస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నప్పుడు బోయపాటి కంటికి చిక్కింది. బాలయ్య సరసన సోనాల్‌ అయితే బావుంటుందని భావించి బోయపాటి వెంటనే ఆఫర్‌ ఇచ్చాడు. అలా లెజెండ్‌లో కథానాయిక అయ్యింది. లెజెండ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యాక ఇక తిరుగు చూసుకునే పనేలేకుండా పోయింది. బాలయ్యతోనే లయన్‌లో నటించింది. రామ్‌ పండగ చేస్కోలో బికినీ లుక్‌లో అదరగొట్టేసింది. ఇప్పుడు ఏకంగా బాలయ్యతో హ్యాట్రిక్‌ కొడుతోంది. డిక్టేటర్‌లో నాయికగా నటిస్తోంది. రీఎంట్రీలో కెరీర్‌ గురించి సోనాల్‌ ముచ్చటిస్తూ..

=బాలయ్యబాబుతో తొలి అవకాశం రావడం నా అదృష్టం. లెజెండ్‌ ఘనవిజయం సాధించాక అవకాశాల వెల్లువ మొదలైంది. ఆ వెంటనే లయన్‌ సినిమాలోనూ ఛాన్సొచ్చింది. అయితే వాస్తవానికి నాకు రెండోసారి బాలయ్య సరసన నటించే ఛాన్సొస్తుందని ముందే ఊహించలేదు. కానీ అదృష్టవంతురాలిని. ఇప్పుడు డిక్టేటర్‌లో ముచ్చటగా మూడోసారి ఛాన్సొచ్చినందుకు ఉబ్బితబ్బిబ్బవుతున్నా.

=ఇప్పటివరకూ నేను నటించిన పాత్రలు వేరు. డిక్టేటర్‌లో నా రోల్‌ వేరు. శ్రీవాస్‌ ఈ క్యారెక్టర్‌లో నటిస్తే అది నా కెరీర్‌కి కాలింగ్‌ కార్డ్‌ అవుతుందని చెప్పాడు. బలమైన ఛాలెంజింగ్‌ రోల్‌లో ఛాన్స్‌ దక్కింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అది.

=ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు కళ్యాణ్‌రామ్‌ సరసన 'షేర్‌'లో అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆన్‌సెట్స్‌ ఉన్నా. ఇది అయిపోయి హైదరాబాద్‌లో అడుగుపెట్టాక డిక్టేటర్‌ షూటింగ్‌లో పాల్గొంటాను. ఆర్య సరసన సైజ్‌ జీరోలో చేస్తున్నా.

=బాలయ్యకు షార్ట్‌ టెంపర్‌, కోపం చాలా ఎక్కువ.. అంటూ భయపెట్టేశారు. కానీ ఆన్‌సెట్స్‌ ఆయన్ని దగ్గరగా చూశాక ఆ భయమే లేకుండా పోయింది. నేను విన్నది కరెక్టు కాదని తర్వాత అర్థమైంది. సెట్‌లో స్పాట్‌బోయ్‌ నుంచి ప్రతి ఒక్కరినీ ఎంతో కేరింగ్‌గా చూసుకుంటారు. క్రమశిక్షణతో మెలగుతారు. నా జీవితంలోనే  ఓ నైస్‌ పర్సనాటిటీని చూశాను.

=బాలయ్య అంతటి సీనియర్‌తో నటిస్తే ఇక కుర్రహీరోలతో ఛాన్సులు రావని బెదిరించారు. కానీ ఆ తర్వాత రామ్‌ సరసన పండగ చేస్కోలో ఛాన్సొచ్చింది. కళ్యాణ్‌రామ్‌తో షేర్‌లో ఛాన్సొచ్చింది. ఆర్య సరసన సైజ్‌ జీరోలో అవకాశం వచ్చింది. ఇవన్నీ ఎలా వచ్చినట్టు?

=నీల్‌ నితిన్‌తో ప్రేమాయణం అంటూ పుకార్లొచ్చాయి. కానీ అదేమీ లేదు. నేను ప్రపంచంలో ప్రేమలో పడ్డాను అంటే అది మా మమ్మీతోనే. టైటానిక్‌ చూశాక లియోనార్డో డికాప్రియోతో ప్రేమలో పడ్డా. అలాగే తెలుగులో నటిస్తున్నా అంటే బాలీవుడ్‌లో నటించను అని అర్థం కాదు.
Tags:    

Similar News