ఓటీటీ రిలీజ్ ల‌పై ఏకాభిప్రాయం కుద‌ర‌లేదా?

Update: 2022-07-25 15:30 GMT
టాలీవుడ్ లో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆగ‌స్టు 1 నుంచి సినిమా షూటింగ్ ల‌ని నిర‌వ‌ధికంగా నిలిపివేయాల‌ని నిర్మాత‌ల మండ‌లి, ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా పెరిగిన నిర్మాణ వ్య‌యం, ఓటీటీ రిలీజ్ ల‌పై కూడా కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తారంటూ వార్త‌లు వినిపించాయి. ఇప్ప‌టికే దీనిపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని కూడా లీకులు ఇచ్చారు.ఈ నేప‌థ్యంలోనే నిర్మాత‌ల మండ‌లి కీల‌క భేటీ సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫిలిం ఛాంబ‌ర్ లో జ‌రిగింది.  

ఈ కీల‌క భేటీలో తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి స‌భ్యుల‌తో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా పాల్గొన్నారు. సినిమా షూటింగ్ ల నిలుప‌ద‌ల‌, టికెట్ రేట్ల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించార‌ట‌. అయితే టికెట్ రేట్ల త‌గ్గింపుపై కుదిరిన ఏకాభిప్రాయం షూటింగ్ ల బంద్ విష‌యంలో మాత్రం కుద‌ర‌లేద‌ని, ప‌లువురు నిర్మాత‌లు భిన్నాభిప్రాయాల‌ని వ్య‌క్తం చేశార‌ని తెలిసింది. భేటీ అనంత‌రం నిర్మాత సి. క‌ల్యాణ్ మాట్లాడారు. సినిమా షూటింగ్ ల నిలుపుద‌ల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు.

అంతే కాకుండా సినిమా రంగ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేశామ‌ని, ఈ నెల 27న ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షుడి ఆధ్వ‌ర్యంలో క‌మిటీ భేటీ అవుతుంద‌ని తెలిపారు. అయితే త‌మ మ‌ధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవ‌ని, క‌మిటీ నిర్ణ‌యం మేర‌కు త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ వుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా వుంటే సినీ ఇండ‌స్ట్రీని ప్ర‌ధానంగా ప‌ట్టి పీడిస్తున్న ఓటీటీ రిలీజ్ ల స‌మ‌స్యపై స‌భ్యుల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌లేద‌ని తెలుస్తోంది.

నిర్మాణ వ్య‌యం, ఓటీటీల్లో రిలీజ్ ల‌పై ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చించార‌ట‌. అయితే ఓటీటీల్లో సినిమాల రిలీజ్ ల‌పై ఎవ‌రి అభిప్రాయాల్ని వారు వెల్ల‌డించారే కానీ ఈ స‌మ‌స్య‌పై నిర్మాత‌లు ఏకాభిప్రాయానికి రాలేద‌ని తెలుస్తోంది. దీనిపై మ‌రోసారి చ‌ర్చించ నున్నార‌ట‌.

ఇక స్పెష‌ల్ క‌మిటీలో ఎవ‌రెవ‌రు ఉండాలి? ఏ విభాగాల నుంచి ఎంత మందిని తీసుకోవాలి? ఏఏ అంశాల‌ను అందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి? వంటి విష‌యాల‌పై త‌మ వైఖ‌రి వినిపించిన దిల్ రాజు, మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుప్రియ త‌దిత‌రులు స‌మావేశం నుంచి బ‌య‌టికి వ‌చ్చేశార‌ట‌. తుది నిర్ణ‌యాన్ని కమిటీకే వ‌దిలేశార‌ట‌.

సోమ‌వారం జ‌రిగిన నిర్మాత‌ల మండ‌లి స‌మావేశానికి దిల్ రాజు, మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు, సుప్రియ‌, సునీల్ నారంగ్‌, సి.క‌ల్యాణ్‌, స్ర‌వంతి ర‌వికిషోర్‌, ద‌ర్శ‌కుడు తేజ‌, వైవీఎస్ చౌద‌రి, అశోక్ కుమార్ త‌దిత‌రులు హాజ‌రయ్యారు. ఇక ఏపీలో సినీ ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల‌పై నిర్మాత ముత్యాల ర‌మేష్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఆంధ్రాలో సినీ ప‌రిశ్ర‌మ స‌ర్వ‌నాశ‌నం అయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎగ్జిబిట‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ చాలా వ‌ర‌కు న‌ష్ట‌పోయార‌న్నారు. ఓటీటీల వ‌ల్ల థియేట‌ర్ల‌కు న‌ష్టం జ‌రుగుతోంద‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

సినిమా విడుద‌లైన ఎనిమిది వారాలకు పెద్ద చిత్రాన్ని, నాలుగు వారాకు చిన్న సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకోవ‌చ్చ‌ని స‌మావేశంలో తీర్మానించ‌మ‌న్నారు. క‌లెక్ష‌న్ ల విష‌యంలో త‌ప్పుడు లెక్క‌లు చూపించ‌డం వ‌ల్ల హీరోలు బాగుప‌డ్డారే కానీ ఎగ్జిబిట‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ న‌ష్ట‌పోయార‌న్నారు.
Tags:    

Similar News