నిమ్మకూరు నుంచి ఎవరో రామారావు అంట..

Update: 2021-05-28 08:40 GMT
తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం ప్రముఖంగా వినిపించే పేర్లలో ఎన్టీఆర్ ఒకటి. ఏపీలోని కృష్ణాజిల్లా నిమ్మ‌కూరులో 1923 మే 28న‌ జ‌న్మించిన ఆయ‌న‌.. సినిమా మీద ప్రేమ‌తో ఉద్యోగాన్ని సైతం వదిలి ఇండ‌స్ట్రీకి వెళ్లారు. అలా.. 1949లో త‌న ప్ర‌స్థానం మొద‌లు పెట్టారు ఎన్టీఆర్. ఆయ‌నకు తొలిసారి ‘పల్లెటూరి పిల్ల’ చిత్రంలో అవకాశం ఇచ్చారు నిర్మాత బి.ఏ. సుబ్బారావు. ఆ త‌ర్వాత దర్శకుడు ఎల్వీ ప్రసాద్ ‘మనదేశం’ చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు. ఇందులో మనదేశం ముందుగా రిలీజ్ కావడంతో.. ఇదే ఎన్టీఆర్ మొదటి సినిమా అయ్యింది.

అప్ప‌టికే.. అక్కినేని నాగేశ్వరరావు మంచి స్వింగ్ లో ఉన్నారు. ప‌ల్నాటి యుద్ధం, బాల‌రాజు, కీలుగుర్రం, లైలామజ్ను వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ గా వెలుగొందుతున్నారు. అప్పటి వరకు నటించిన నాగ‌య్య‌, చ‌ద‌ల‌వాడ వంటివారు సీనియ‌ర్ అయిపోయారు. దీంతో.. అక్కినేని మాత్రమే లైన్లో ఉన్నారు. ఇలాంటి కరక్ట్ టైమ్ లో ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు ఎన్టీఆర్‌.

ఏఎన్నార్ వెంట ప‌డే ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు డేట్స్ దొరికేవి కావు. సాంఘికం, పౌరాణికం, జాన‌ప‌దం అంటూ వ‌రుస సినిమాలు చేస్తుండ‌డంతో.. మేక‌ర్స్ క్యూలో ఉండాల్సి వ‌చ్చింది. అలాంటి స‌మయంలోనే ఎన్టీఆర్ అనే కుర్రాడు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడ‌ని తెలిసింది. దీంతో.. అనివార్యంగా వారు ఎన్టీఆర్ తో సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఆ విధంగా.. ఎన్టీఆర్ అందుకున్న ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌..1950లో వచ్చిన ‘షావుకారు’. ఆ తర్వాత 1951లో వచ్చిన ‘పాతాళ భైర‌వి’ చిత్రం ఎన్టీఆర్ సినీ కెరీర్ ను మ‌లుపు తిప్పింది. ఈ సినిమా విజ‌యంతో ఆయ‌న తిరుగులేని స్టార్ గా మారిపోయారు.

పౌరాణికం, సాంఘికం, జాన‌ప‌దం అంటూ.. ప్ర‌తీ విభాగంలో త‌న‌దైన ముద్ర‌వేశారు. ఎన్నో హిట్లు, సూప‌ర్ హిట్లు అందుకున్నారు. అయితే.. మిగిలిన వారి నుంచి ఆయ‌న్ను ప్ర‌త్యేకంగా నిలిపింది మాత్రం పౌరాణికాలే. రాముడిగా, కృష్ణుడిగా ఎన్టీఆర్ వేసుకున్న మేక‌ప్ జ‌నాల‌కు విప‌రీతంగా న‌చ్చేసింది. నిజంగా వాళ్లు ఇలాగే ఉండేవారేమో అన్న‌ట్టుగా ప్రేక్ష‌కులు అనుభూతికి లోన‌య్యేవారంటే అతిశ‌యోక్తి కాదు. అన్ని భాష‌ల్లో క‌లిపి సుమారు 400 చిత్రాల్లో న‌టించిన ఎన్టీఆర్ తొంభై శాతానికి పైగా స‌క్సెస్ రేటును క‌లిగి ఉన్నారంటే.. ఆయ‌న స్టార్ డ‌మ్ ఏంట‌న్న‌ది అర్థం చేసుకోవ‌చ్చు.

ఆ త‌ర్వాత‌.. త‌న‌ను ఇంత వాణ్ని చేసిన తెలుగు ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌ని అనుకున్న ఎన్టీఆర్ రాజ‌కీయ అరంగేట్రం చేశారు. అప్ర‌తిహ‌తంగా హ‌వాసాగిస్తున్న కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు 1982 మార్చి 29న‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన కేవ‌లం 9 నెల‌ల్లోనే అఖండ విజ‌యం సాధించి, ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చుకున్నారు. ప్ర‌జ‌ల‌కు 2 రూపాయ‌ల‌కు కిలో బియ్యం మొద‌లు ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. ప‌లు నిర్ణ‌యాల‌తో ఆ త‌ర్వాత‌ ఓట‌మిపాల‌య్యారు. అనంత‌రం మ‌ళ్లీ గెలిచిన‌ప్ప‌టికీ.. కొంత‌కాల‌మే సీఎంగా ప‌నిచేశారు. త‌న వ్య‌క్తిగ‌త జీవితం.. పార్టీలో మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌తో మ‌నోవేద‌న‌కు గుర‌య్యార‌ని చెబుతారు. ఈ క్ర‌మంలోనే 1996 జ‌న‌వ‌రి 18న గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్టు ప్ర‌క‌టించారు.

మొత్తానికి.. ఇటు వెండితెర‌పై, అటు రాజ‌కీయ తెర‌పై ఎన్టీఆర్ తిరుగులేని ముద్ర‌వేశారన్నది యథార్థం. తద్వారా.. తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చెరిగిపోని సంతకం చేశారు. ఇవాళ ఆయ‌న 99వ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ఆ మ‌హాన‌టుడికి ‘‘తుపాకీ’’ ఘన నివాళి.
Tags:    

Similar News