మూవీ రివ్యూ : శ్రీకారం

Update: 2021-03-11 11:32 GMT
చిత్రం : శ్రీకారం

నటీనటులు: శర్వానంద్-ప్రియాంక మోహన్-రావు రమేష్-మురళీ శర్మ-సాయికుమార్-నరేష్-సత్య-సప్తగిరి-ప్రభాస్ శీను తదితరులు

సంగీతం: మిక్కీ జే మేయర్

ఛాయాగ్రహణం: యువరాజ్

మాటలు: సాయిమాధవ్ బుర్రా

నిర్మాతలు: రామ్ ఆచంట-గోపీనాథ్ ఆచంట

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కిషోర్.బి

వ్యవసాయ నేపథ్యంలో కథతో శర్వానంద్ హీరోగా కొత్త దర్శకుడు కిషోర్ రూపొందించిన చిత్రం ‘శ్రీకారం’. ప్రోమోలు చూస్తే ఒక మంచి ప్రయత్నంలా కనిపించిన ‘శ్రీకారం’ మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఆ అంచనాలను సినిమా ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ: కార్తీక్ (శర్వానంద్) ఒక రైతు కుటుంబంలో పుట్టిన కుర్రాడు. వ్యవసాయం చేసి తండ్రి అప్పుల పాలైతే.. కార్తీక్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం తెచ్చుకుని ఆ అప్పులన్నీ తీరుస్తాడు. ఉద్యోగంలో మంచి స్థాయిని అందుకుని అమెరికాకు వెళ్లే అవకాశం కూడా అందుకున్న కార్తీక్.. ఉన్నట్లుండి వ్యవసాయం వైపు అడుగులేస్తాడు. తండ్రితో పాటు ప్రేమించిన అమ్మాయి కుటుంబం కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. సొంత ఊరిలోనే అతడికి మద్దతు లభించదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అతను వ్యవసాయం చేయడానికే నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న అడ్డంకులేంటి.. వాటిని అధిగమించి అతను అనుకున్నది ఎలా సాధించాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: వ్యవసాయం అన్నది నిజ జీవితంలోనే కాదు.. సినిమాలకు కథా వస్తువుగా కూడా అంత ఆకర్షణీయం కాదు. యువత ఇప్పుడు ఏమాత్రం వ్యవసాయంలో ఉందో అందరికీ తెలిసిందే. ఇక సినిమాకు మహరాజ పోషకులైన ఆ యువతను మెప్పించడానికి కూడా వ్యవసాయం పనికి రాదు. ఐతే ‘శ్రీకారం’ సినిమాను వ్యవసాయం చుట్టూనే నడిపించి యువతతో పాటు అందరిలోనూ ఒక కదలిక తేగలిగాడు కొత్త దర్శకుడు కిషోర్. ఇందులో చూపించేవన్నీ మనకు తెలిసిన విషయాలే. అంత కొత్తవేమీ కాదు. కానీ మనం వాటి గురించి ఆలోచించడమే మానేశాం. ఉరుకుల పరుగుల జీవితాలతో సాగిపోతున్న అందరికీ చిన్న పాస్ ఇచ్చి.. మన మూలాల్ని గుర్తు చేసే సినిమా ‘శ్రీకారం’. ‘మహర్షి’లో వీకెండ్ ఫార్మింగ్ అంటూ వ్యవసాయం గురించి పైపైన టచ్ చేసి వదిలితే.. ‘శ్రీకారం’ పూర్తిగా సేద్యం చుట్టూనే తిరుగుతూ.. రైతుల సమస్యకు వాస్తవికమైన పరిష్కారాలు చూపిస్తూ.. అందరిలోనూ ఒక ఆలోచన రేకెత్తించేలా సాగుతుంది. సినిమా పూర్తిగా సీరియస్ గా సాగడం.. అక్కడక్కడా నాటకీయత ఎక్కువ కావడం.. ఎక్కువగా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు కథ నడవడం ఇందులోని బలహీనతలు. అయినప్పటికీ ‘శ్రీకారం’ ప్రేక్షకులను చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది.

‘శ్రీకారం’ సినిమా పతాక సన్నివేశంలో హీరో వ్యవసాయంలో ఎంత భవిష్యత్తుందో ఉందో చాలా చక్కగా వివరిస్తాడు. ఏ రంగంలో అయినా పని చేసే వాళ్లలో ‘షార్టేజ్’ వస్తే డిమాండ్ ఏర్పడి ఆ రంగం ఎలా వెలిగిపోతుందో.. సాఫ్ట్ వేర్.. రియల్ ఎస్టేల్ రంగాలను ఉదాహరణగా చూపిస్తూ ఇప్పుడు రైతుల కొరతతో వ్యవసాయానికి ఎంత డిమాండ్ ఏర్పడబోతుందో ఎంతో అర్థవంతంగా చెబుతాడు కథానాయకుడు. ‘శ్రీకారం’ సినిమా ఎసెన్స్ అంతా ఈ సన్నివేశంలోనే ఉంది. ఈ సినిమాను ఎంత నిజాయితీగా తీశారో చెప్పడానికి  ఈ సేనే ఉదాహరణ. సినిమాలో చాలా వరకు వ్యవసాయంలో సమస్యలకు అర్థవంతమైన.. వాస్తవికమైన పరిష్కారాలే చూపించారు. అవి లెక్చర్ లాగా అనిపించవు. కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా తీర్చిదిద్దారు. ఇంతకుముందు ‘మహర్షి’లో చూసిన వీకెండ్ ఫార్మింగ్ అంటూ చూపించింది తెర మీద చూడటానికి బాగుంటుంది. వాస్తవంగా అదంత సులువుగా చేసే పని కాదు. అక్కడ వ్యవసాయాన్ని సినిమా కోసం కమర్షియల్ గా వాడుకునే ప్రయత్నమే జరిగింది. కానీ ‘శ్రీకారం’ అలా కాకుండా ఒక నిజాయితీతో కూడిన.. జనాల్లో నిజంగా మార్పు తేవాలనే తపనతో చేసిన సినిమాలా కనిపిస్తుంది. ఇక్కడే ‘శ్రీకారం’ ప్రత్యేకతను చాటుకుంటుంది.

‘శ్రీకారం’లో హీరో ఉద్యోగం విడిచిపెట్టి వ్యవసాయం చేస్తాడు అనే పాయింట్ ముందే రివీల్ అయిపోయింది. పూర్తిగా ఈ పాయింట్ చుట్టూనే నడవడం తెలుగులో ఒక కొత్త ప్రయత్నంగా చెప్పొచ్చు. ఐతే దాన్ని పక్కన పెడితే.. ‘శ్రీకారం’ ఒక ఫార్మాట్లో.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు సాగే సినిమానే. ముందు హీరోను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పరిచయడం చేయడం.. స్నేహితులతో సరదాలు.. హీరోయిన్ తో ప్రేమాయణం.. ఇవన్నీ కాలక్షేపానికి పనికొచ్చే సన్నివేశాలే. హీరో వ్యవసాయం వైపు అడుగు వేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఐతే ఇక్కడి నుంచి కూడా హీరోకు ముందు అన్నీ ప్రతికూలంగా కనిపించడం.. తర్వాత కొంత కలిసి రావడం.. అంతా బాగుందనుకున్నపుడు మళ్లీ పరిస్థితులు ఎదురు తిరగడం.. తర్వాత అన్ని అడ్డంకులనూ అధిగమించి హీరో అనుకున్నది సాధించడం.. ఇలా ఒక కమర్షియల్ ఫార్మాట్లోనే ‘శ్రీకారం’ నడిచిపోతుంది. దీని వల్ల ప్రేక్షకులు ఎక్కడా పెద్దగా సర్ప్రైజ్ అయ్యేదేమీ ఉండదు. కాకపోతే బయట పచ్చని పంట పొలాల్ని చూస్తే కలిగే మంచి ఫీలింగే.. ఈ సినిమాలో వ్యవసాయం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా ఇస్తాయి. రావు రమేష్-శర్వా మధ్య వచ్చే సన్నివేశాల్లో నాటకీయత కొంచెం తగ్గించి ఉండాల్సింది. కొన్ని సీన్లలో మాత్రం ఉద్వేగాలు పండాయి. సాయికుమార్ చేసిన నెగెటివ్ రోల్ ఇంకొంచెం బలంగా ఉండాల్సింది. అలాగే హీరోకు ఎదురయ్యే అడ్డంకులు.. సంఘర్షణ కూడా ఇంకా బలంగా ఉంటే ‘శ్రీకారం’ స్థాయి వేరుగా ఉండేది. అయినప్పటికీ సినిమా ఎక్కడా ఎబ్బెట్టుగా మాత్రం అనిపించదు. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు మరీ పిండేయకుండా సింపుల్ గా ముగించడం ఆకట్టుకుంటుంది. మొత్తంగా చూస్తే ‘శ్రీకారం’ ఒక మంచి సందేశాన్ని కమర్షియల్ స్టయిల్లో చెప్పే ప్రయత్నం చేసిన సినిమా. వినోదం కోసం కాకుండా.. భావోద్వేగాల కోసం ఈ సినిమా చూడొచ్చు.

నటీనటులు: శర్వా ఎంత పరిణతి చెందాడో ‘శ్రీకారం’లో కనిపిస్తుంది. ఇంటెన్స్.. సీరియస్ పాత్రలు చేయడంలో తన ప్రత్యేకతను అతను మరోసారి చాటి చెప్పాడు. ఎక్కడా అతి చేయకుండా కుదురుగా కార్తీక్ పాత్రను అతను పండించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చాలా బలమైన విషయాలను ఆ పాత్ర ద్వారా చెప్పేటపుడు శర్వా చూపించిన నియంత్రణ మెప్పిస్తుంది. కార్తీక్ పాత్ర మీద ప్రేక్షకులకు ఒక ఆపేక్ష ఏర్పడేలా శర్వా చేయగలిగాడు. హీరోయిన్ ప్రియాంక మోహన్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. లుక్స్.. అప్పీయరెన్స్ పరంగా ఆమెకున్న పరిమితులు ఈ సినిమాలో తెలుస్తాయి. ‘గ్యాంగ్ లీడర్’లో గుంభనంగా ఉన్న పాత్రలో ప్రియాంకను చూశాక.. ఇందులో అల్లరి అమ్మాయి పాత్రకు సూటవ్వలేదనిపిస్తుంది. ఆమె నటన పర్వాలేదు. సినిమాలో ఆమెకున్న స్కోప్ తక్కువే. మిగతా నటీనటుల్లో రావు రమేష్ కు ఎక్కువ మార్కులు పడతాయి. ఆయన మాత్రమే చేయదగ్గ పాత్ర అనిపించేలా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన.. డైలాగులు చెప్పిన విధానం చాలా బాగుంది. నరేష్ మరోసారి పల్లెటూరి పాత్రలో సులువుగా ఒదిగిపోయాడు. ఆమని.. మురళీ శర్మ.. తమ పాత్రల పరిధిలో బాగా చేశారు. సాయికుమార్ ఓకే. సత్య పాత్ర కొంత మేర నవ్వించింది. సప్తగిరి పెద్దగా చేసిందేమీ లేదు.

సాంకేతికవర్గం: సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్.. సంక్రాంతి పాట.. టైటిల్ సాంగ్ లో తన ప్రత్యేకతను చూపించాడు. వచ్చానంటివే పాట కూడా ఓకే. కానీ మళ్లీ మళ్లీ వినాలనిపించే అతడి మార్కు మెలోడీలు మాత్రం మిస్సయ్యాయి. నేపథ్య సంగీతం విషయానికొస్తే.. సన్నివేశాల్లో ఉన్న దానికంటే మెలో డ్రామా ఎక్కువైపోయేలా ఔట్ పుట్ ఇచ్చాడు. చాలా చోట్ల ఆర్ఆర్ అతిగా అనిపిస్తుంది. యువరాజ్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఒక పెద్ద సినిమా స్థాయిలో దీనికి ఖర్చు చేశారు. పొలాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నింట్లోనూ నిర్మాతల కృషి కనిపిస్తుంది. ఇక దర్శకుడు కిషోర్ విషయానికొస్తే.. అతను తొలి ప్రయత్నంలో మంచి మార్కులే వేయించుకున్నాడు. అతను ఎంచుకున్న కథే ప్రత్యేకమైంది. అలాగే సాహసోపేతమైంది. ఏమాత్రం తేడా వచ్చినా ఒక లెక్చర్ లాగా అనిపించి ప్రేక్షకులకు చిరాకు తెప్పించే కథాంశం ఇది. కానీ విసుగు తెప్పించకుండా ఎంగేజ్ చేసే కథనంతో సినిమాను నడిపించాడు. ఎమోషన్లను పండించడంలో అతడి ప్రతిభ కనిపిస్తుంది. అతడి నరేషన్ మాత్రం కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. అలాగే ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా కథనాన్ని నడిపించలేకపోయాడు. ఈ బలహీనతల్ని అధిగమిస్తే కిషోర్ మంచి స్థాయికి వెళ్లగలడు.

చివరగా: శ్రీకారం.. ఒక మంచి ప్రయత్నం

రేటింగ్- 2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News