దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఛత్రపతి` - `బాహుబలి` సినిమాల్లో మదర్ సెంటిమెంట్ హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తల్లీ కొడుకుల మధ్య ప్రేమాప్యాయతలు....అనుబంధాలను జక్కన్న చక్కగా తెరకెక్కించారు. రీల్ లైఫ్ లోనే కాకుండా...రియల్ లైఫ్ లో కూడా జక్కన్నకు మదర్ సెంటిమెంట్ ఎక్కువ. అందుకే, తన తల్లి జ్ఞాపకార్థం... ఓ పాఠశాల ఆధునీకరణకు జక్కన్న 40లక్షలు విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా, స్వయంగా వచ్చి ఆ పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. సతీ సమేతంగా వచ్చిన జక్కన్న రిబ్బన్ కట్ చేసి నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తన పాఠశాల రోజులను జక్కన్న గుర్తు చేసుకున్నారు.
విశాఖపట్నం జిల్లా కసింకోటలోని జడ్ పీ ఉన్నత పాఠశాల ఆధునీకరణకు రాజమౌళి రూ.40 లక్షలు విరాళమిచ్చారు. తన తల్లి పేరిట నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించేందుకు రాజమౌళితోపాటు ఆయన భార్య రమా రాజమౌళి నేడు కసింకోటకు వచ్చారు. జక్కన్న దంపతులకు అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ - పాఠశాల సిబ్బంది సాదర స్వాగతం పలికారు. స్థానికులు - అభిమానులు - చిన్నారులతో వారు సందడి చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.... పిల్లలు చదువులతో పాటు ఆడుకునేందుకు మరింత సమయాన్ని కేటాయించాలని అన్నారు. తరగతి గదుల్లోకన్నా - మైదానంలో ఆడుకునే సమయంలోనే వారు ఎక్కువ నేర్చుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా తన పాఠశాల రోజులను రాజమౌళి గుర్తు చేసుకున్నారు.