SSMB28.. కొత్త సమస్య

Update: 2022-12-06 06:35 GMT
సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా అధికారిక ప్రకటన వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కాబోతుంది. గత ఏడాది సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ తో పాటు సమాంతరంగా త్రివిక్రమ్‌ సినిమాను కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి. కానీ కరోనా ఇతర కారణాల వల్ల సినిమా ను వాయిదా వేస్తూ వచ్చారు.

మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమాను ముగించి వచ్చిన వెంటనే త్రివిక్రమ్‌ సినిమాను మొదలు పెడతారు అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా త్రివిక్రమ్‌ తనకు సమయం కావాలంటూ కోరారట. ఆ సమయంలో భీమ్లా నాయక్ తో పాటు మరో సినిమా యొక్క స్క్రిప్ట్‌ వర్క్ లో త్రివిక్రమ్‌ ఉన్నారనే వార్తలు వచ్చాయి.

ఆ విషయం పక్కన పెడితే ఎన్నో అడ్డంకులు మరియు ఎంతో కాలం ఎదురు చూపులు తర్వాత సినిమా మొదలు అయ్యింది. హమ్మయ్య షూటింగ్‌ మొదలు అయ్యింది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మొదటి షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు అమ్మగారు ఇందిరా దేవి మృతి చెందారు.

తల్లి మృతి భారం తో మహేష్ బాబు ఉన్న సమయంలోనే త్రివిక్రమ్‌ సినిమా తదుపరి షెడ్యూల్‌ కు సిద్ధం చేశారు. మహేష్ బాబు కూడా తన వల్ల సినిమా ఆలస్యం అవ్వద్దు అనుకున్నారు. షూటింగ్‌ కు అన్ని ఏర్పాట్లు చేశారు అనుకుంటూ ఉండగా సూపర్ స్టార్‌ కృష్ణ మృతితో మళ్లీ SSMB28 సినిమా షూటింగ్‌ ఆగి పోయింది.

ఆ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఈ నెల రెండవ వారంలో షూటింగ్‌ కు హాజరు అయ్యేందుకు ఓకే చెప్పగా ఇప్పుడు పూజా హెగ్డే డేట్లు కుదరడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డే డేట్లు అవసరం అవ్వడం.. ఆమె నో అనడంతో వచ్చే నెల కు ఈ షెడ్యూల్‌ ను వాయిదా వేయడం జరిగింది అంటూ ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలు అయ్యిందో కానీ ఇప్పటివరకు అడ్డంకులే అడ్డంకులు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పటికే కొత్త విడుదల తేదీని ప్రకటించారు. పూజా హెగ్డే డేట్‌ లు లేకపోవడం వల్ల మళ్లీ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News